Congress: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులుగా తెలంగాణ మంత్రులు..!
ఇటీవల జరిగిన జమ్మూ అండ్ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. దీంతో మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో విజయం సాధించాలని హస్తం పార్టీ సిద్ధమైంది. ఇందుకోసం పలువురిని పరిశీలకులుగా పంపనుంది. ఏఐసీసీ మహారాష్ట్ర, జార్ఖండ్ పరిశీలకులుగా 11 మందిని ఎంపిక చేసింది. వీరిలో తెలంగాణ చెందిన ముగ్గురికి స్థానం దక్కింది. మహారాష్ట్రలోని 5 డివిజన్లకు 11 మందిని నియమించగా.. ఇందులో తెలంగాణకు చెందిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క ఉన్నారు.
మరాఠ్వాడా రీజియన్ పరిశీలకులుగా సచిన్ పైలట్, మంత్రి ఉత్తమ్‌ను ఏఐసీసీ ఎంపిక చేసింది. నార్త్ మహారాష్ట్రకు మంత్రి సీతక్క, సయ్యద్ నసీర్ హుస్సేన్‌ను నియమించింది. జార్ఖండ్‌కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు అన్వర్, అధిర్ రంజన్ చౌదరిని ఏఐసీసీ నియమించింది.
కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 22 నోటిఫికేషన్ రానుంది.

అక్టోబర్ 29 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 30న నామినేషన్ల స్క్రూటీ చేయనున్నారు. నామినేషన్ విత్ డ్రాకు నవంబర్ 4 తేదీ వరకు గడువు ఇచ్చారు.
నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించింది. 81 స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీకి రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు.
మొదటి దశకు సంబంధించి అక్టోబర్ 18న నోటిఫికేషన్ రానుంది. అక్టోబర్ 25 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 28న నామినేషన్ల స్క్రూటీని ఉంటుంది. అక్టోబర్ 30న నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం కల్పించారు. నవంబర్ 13న తొలి దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రెండో దశకు సంబంధించి అక్టోబర్ 22న నోటిఫికేషన్ రానుంది. అక్టోబర్ 29 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 30న నామినేషన్ల స్క్రూటీని ఉంటుంది. నవంబర్ 1 వరకు నామినేషన్లు విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది. నవంబర్ 20న రెండో దశ పోలింగ్ జరగనుంది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెల్లడికానున్నాయి.












Click it and Unblock the Notifications