ఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్ మార్పు ఇలా: రూ. 32వేల కోట్లతో రెండో దశ పనులు
మెట్రో రైలు రెండో దశ డీపీఆర్‌లు సిద్ధం చేయడంతోపాటు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్ మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరాంఘర్-బెంగళూరు హైవే, కొత్త హైకోర్టు మీదుగా విమానాశ్రయానికి మెట్రో లైన్‌ను ఖరారు చేసింది. కారిడార్-4లో నాగోల్-శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.6 కి.మీ మార్గానికి ఆమోదం తెలిపింది.
గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయించిన ప్రకారం ఎయిర్ పోర్ట్ మెట్రో అలైన్మెంట్ ను ఆరాంఘర్, 44వ నెంబర్ జాతీయ హదారి(బెంగళూరు హైవే)లోని కొత్త హైకోర్టు ప్రాంతం మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా ఖరారు చేస్తున్నట్లు హైదరాబాద్ మెంట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఎయిర్ పోర్టు కారిడార్‌లో 1.6 కిలోమీటర్ల మేర మెట్రో రైలు భూగర్భ మార్గంలో వెళ్లనుంది.

ఇది ఇలావుంటే, రూ. 8 వేల కోట్ల అంచనా వ్యయంతో ఫ్యూచర్ సిటీకి మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు, మెట్రో రైలు రెండో దశ డీపీఆర్ కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం పంపనున్నారు. మొత్తంగా 116.2 కి.మీలో రెండో దశ పనులు చేపట్టనున్నారు.
రూ. 32,237 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో రైలు రెండో దశ పనులు జరగనున్నాయి. ఈ దశలో కొత్తగా ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలును అందుబాటులోకి తీసురానున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా, మెట్రో రైలు రెండో దశ డీపీఆర్‌ల తయారీ పురోగతిని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ సీనియర్ అధికారులతో సమీక్షించారు.
ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మెట్రో రెండో దశ కారిడార్‌ల అలైన్మెంట్, స్టేషన్లు మొదలైన వాటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవివరమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు. అన్ని కారిడార్లకు సంబంధించిన డీపీఆర్‌లకు తుది మెరుగులు దిద్దుతున్నామని, ట్రాఫిక్ అంచనాల విషయంలో హెచ్‌ఎండీఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాకు సిద్ధం చేస్తున్న కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ) ట్రాఫిక్ అధ్యయన నివేదిక కోసం హెచ్‌ఏఎంఎల్ ఎదురుచూస్తోందని ఎన్వీఎస్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు.












Click it and Unblock the Notifications