అదో దొంగల ముఠా! డీలిమిటేషన్ భేటీపై బండి సంజయ్ హాట్ కామెంట్స్
చెన్నై వేదికగా డీలిమిటేషన్‌పై తమిళనాడు, తెలంగాణ, కేరళ, తమిళనాడుకు చెందిన ప్రజాప్రతినిధులు సమావేశమైన విషయం తెలిసిందే. ఈ భేటీపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్‌పై కలిసిన వారంతా దొంగలముఠానే అంటూ తీవ్రంగా స్పందించారు.
'డీలిమిటేషన్‌పై కలిసిన వారంతా దొంగల ముఠానే. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటే. కేసుల నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్కు కాంగ్రెస్ సహకరిస్తోంది. ఢిల్లీలో కలిసి ఉంటారు.. గల్లీలో కొట్లాడుకుంటారు. డీఎంకే భేటీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ వెళ్లాయంటే ఇద్దరూ ఒక్కటా?కాదా? కేసుల విషయంలో కేసీఆర్ కుటుంబానికి ఒక్క నోటీసు కూడా ఇవ్వట్లేదు. బీజేపీకి వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడుతున్నారు' అని బండి సంజయ్ విమర్శించారు.

డీలిమిటేషన్ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదని బండి సంజయ్ అన్నారు. 6 గ్యారంటీల హామీల దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ యత్నిస్తోందని కేంద్రమంత్రి విమర్శించారు. తమిళనాడులో డీఎంకే రూ.వెయ్యి కోట్ల మద్యం కుంభకోణం చేసిందని ఆరోపించారు. డీఎంకేను సాగనంపేందుకు తమిళ ప్రజలు సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
మరోవైపు, గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలపై బండి సంజయ్ విమర్శలు ఎక్కుపెట్టారు. గత పదేళ్లలో తెలంగాణలో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనూ రైతులను ఆదుకున్న దాఖలాలు లేవన్నారు. ప్రస్తుతం వడగళ్ల వానతో నష్టోయిన రైతన్నలకు పరిహారం చెల్లించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
గతంలో సమీక్షలు, సర్వేలు, నివేదికల పేరుతో కాలం గడిపారన్నారని బండి సంజయ్ బీఆర్ఎస్ పాలనపై మండి పడ్డారు. సర్వే చేసి వారం రోజుల్లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు, డీలిమిటేషన్ భేటీపై బీజేపీ ఈటల రాజేందర్ కూడా మండిపడ్డారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకోనప్పటికీ విమర్శలు చేస్తున్నారన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు ప్రధాని మోడీ అన్యాయం చేయరన్నారు. హైదరాబాద్‌లో ఒకటి కాదు 50 డీమిటేషన్ భేటీలు పెట్టుకోవచ్చని అన్నారు. దేశంలోని పేద రాష్ట్రాలకు ఎక్కువ డబ్బులు ఇస్తే తప్పేంటని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications