కూలీగా మారిన అసిస్టెంట్ ప్రొఫెసర్.. తర్వాత ఏం జరిగిందంటే!!
విధి చాలా విచిత్రమైనది. అది ఎవరి జీవితం పై ఎప్పుడు ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఎవరమూ చెప్పలేము. బాగా చదువుకొని ఉన్నత విద్యనభ్యసించి బోధనా వృత్తిని ఎంచుకుని అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా కూలీగా మారి ఎవరికీ చెప్పకుండా ఒక మార్కెట్ లో పనిచేస్తున్న ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది.
తన వ్యక్తిగత జీవితం పైన అసంతృప్తితో ఉన్న ఒక వ్యక్తి ఎవరూ ఊహించని షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. గొప్ప చదువులు చదివి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఓ ప్రైవేటు కాలేజీలో పనిచేస్తున్న వ్యక్తి ఒక్కసారిగా కూలిగా మారాడు. హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన ఈ షాకింగ్ సంఘటన వివరాల్లోకి వెళితే..

ఏప్రిల్ 7వ తేదీన తాను పనిచేస్తున్న కళాశాల హాస్టల్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న వ్యక్తి ఎవరికీ చెప్పకుండా మాయమయ్యాడు. అతనిది తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కావడంతో తన స్వగ్రామానికి వెళ్లి ఉండవచ్చని కళాశాల అధికారులు భావించారు. అయితే సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ అక్కడకు కూడా పోకపోవడంతో కళాశాల యాజమాన్యంతో పాటు, కుటుంబ సభ్యులు ఆందోళనలో పడ్డారు.
ఇక ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి మొత్తానికి సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ ను పట్టుకున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ లోని స్థానిక పండ్ల మార్కెట్ లో సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ కూలీగా పని చేస్తున్నాడని తెలిసి అక్కడ నిఘా పెట్టి ఎట్టకేలకు అతడిని పట్టుకున్నారు. అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
కుటుంబ సభ్యులకు అతనికి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలని సూచించిన పోలీసులు, అతను ఎందుకు కూలిగా మారాడు. ఎవరికీ చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయాడు వంటి కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఫైనల్ గా మానసిక వైద్యుల సహాయంతో సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ కు కౌన్సిలింగ్ ఇప్పించాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications