అంగన్వాడీలలో చిన్నారులకు తొలిముద్ద బ్రేక్ ఫాస్ట్ పథకంపై కీలక అప్డేట్!
తెలంగాణలో అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయటంపైన తెలంగాణా సర్కార్ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తోంది.అంతేకాదు అంగన్వాడీ కేంద్రాలలో నియామకాలు చేపట్టి టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీ చేస్తుంది. ఇక అంగన్వాడీ సెంటర్లలో చిన్నారుల హాజరును పెంచటం కోసం ఒక్క కొత్త పథకం కూడా అందుబాటులోకి తెచ్చింది.
తొలిముద్ద బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అందిస్తున్న రేవంత్ సర్కార్
అంగన్వాడీ సెంటర్లలో చిన్నారులకు పౌష్టికాహారం అందించే తొలిముద్ద బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ గా అందిస్తున్న సర్కార్ మరికొన్ని జిల్లాలకు ఈ బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ను విస్తరించటానికి రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. మహబూబాబాద్, వికారాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, ములుగు జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

మరికొన్ని జిల్లాలలో తొలిముద్ద బ్రేక్ ఫాస్ట్ స్కీం విస్తరణకు ప్లాన్
ఇప్పటికే ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయగా, పిల్లల హాజరు గణనీయంగా పెరిగింది.పైలెట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించిన జిల్లాలలో సక్సెస్ కావటంతో మరికొన్ని జిల్లాలలో ఈ పథకం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. తొలిముద్ద బ్రేక్ ఫాస్ట్ స్కీం ద్వారా చిన్నారులకు ఉదయం పూటనే పౌష్టికమైన ఆహారం అందించి పోషకాహార లోపాన్ని నివారించడం, అంగన్‌వాడీకి హాజరు పెంచడం, వారి ఆరోగ్యం, అభివృద్ధిని మెరుగుపరచడం ఈ పథకం ముఖ్య లక్ష్యం.
రాష్ట్రవ్యాప్తంగా 35,781 అంగన్‌వాడీ కేంద్రాలకు విస్తరించే ఆలోచన
సాధారణంగా పాలు, అన్నం, పప్పు, కూరగాయలు, గుడ్డు లేదా ఇతర పౌష్టిక వస్తువులతో కూడిన సాధారణ, పోషకమైన ఆహారాన్ని అందిస్తున్నారు. ప్రతి జిల్లా అవసరాలకు అనుగుణంగా మెనూ మారుతుంది. రెండో విడత అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 35,781 అంగన్‌వాడీ కేంద్రాలకు ఈ తొలిముద్ద పథకాన్ని విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
అంగన్వాడీలకు పిల్లల్ని పంపించటంలో పెరగనున్న శ్రద్ధ
అంగన్‌వాడీలను బలోపేతం చేయడం, చిన్నారులకు మెరుగైన పోషకాహారం అందించడం దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ విస్తరణతో మరిన్ని జిల్లాల్లోని పిల్లలు లబ్ధి పొందనున్నారు. ఈ విధానం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాలలో అమలు జరగనుంది. ఫలితంగా అంగన్వాడీలకు పిల్లల్ని పంపించటంలో తల్లిదండ్రుల శ్రద్ధ పెరుగుతుంది.













Click it and Unblock the Notifications