రూ.2.29 లక్షల బైక్‌కు భారీ క్రేజ్.. డిమాండ్ చూసి బుకింగ్స్ ఆపేసిన కంపెనీ!
ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన 'హిమాలయన్ 440' మోటార్ సైకిల్‌కు ఆటోమొబైల్ మార్కెట్లో ఊహించని రీతిలో రికార్డు స్థాయి స్పందన లభించింది. సెప్టెంబర్ ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చిన ఈ బైక్ కోసం కస్టమర్లు పోటీ పడటంతో బుకింగ్స్ భారీగా పెరిగిపోయాయి. దీంతో నిరీక్షణ సమయం ఏకంగా ఆరు నెలలకు చేరుకోవడంతో కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆ బైక్ బుకింగ్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
పాత హిమాలయన్ ఫార్ములాతో రీ-ఎంట్రీ
రాయన్ ఎన్ఫీల్డ్ ఈ హిమాలయన్ 440 మోడల్‌ను సెప్టెంబర్ 4న రూ.2.29 లక్షల(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. గతంలో అత్యంత ప్రజాదరణ పొందిన పాత హిమాలయన్ 411 స్థానంలో కొత్త హిమాలయన్ 450 వచ్చినప్పటికీ.. చాలా మంది బైక్ ప్రేమికులు పాత క్లాసిక్ డిజైన్, రైడింగ్ అనుభూతినే మిస్ అయ్యారు. కస్టమర్ల అభిరుచిని గమనించిన కంపెనీ.. అదే పాత లుక్, ఆకట్టుకునే ఫీచర్లతో అప్డేట్ చేయబడిన 440సీసీ ఇంజిన్‌తో ఈ కొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఇంజిన్ స్పెసిఫికేషన్లు, ప్రత్యేకతలు
ఈ కొత్త హిమాలయన్ 440 బైక్ లో 443సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 25.5 hp శక్తిని, 34 Nm టాప్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మృదువైన గేర్ షిఫ్టింగ్ కోసం దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఆఫ్-రోడింగ్ సామర్థ్యం కోసం ముందు భాగంలో 21-అంగుళాల వీల్, వెనుక భాగంలో 17-అంగుళాల స్పోక్ వీల్స్ అందించారు. ఎంతటి కఠినమైన రహదారులనైనా సులభంగా అధిగమించడానికి వీలుగా 220 మిలిమీటర్ల భారీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో పాటు భద్రత కోసం డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ ఫీచర్‌ను ప్రామాణికంగా అందించారు. ఈ బైక్ సేలా బ్లాక్, మస్టాంగ్ బ్రౌన్, నెలాంగ్ వైట్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.
బుకింగ్స్ మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతాయి?
ప్రస్తుతం నిలిపివేసిన బుకింగ్స్‌ను ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచిన తర్వాత తిరిగి ప్రారంభించనున్నట్లు రాయల్ ఎన్ఫీల్డ్ స్పష్టం చేసింది. అయితే బుకింగ్స్ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయనే తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. బుకింగ్స్ తిరిగి ప్రారంభమైనప్పటికీ బైక్ ధరలో ఎలాంటి మార్పు ఉండదని, కస్టమర్లు అదే ధరకు బైక్‌ను సొంతం చేసుకోవచ్చని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.














Click it and Unblock the Notifications
