జస్టిస్ ఎల్ఎన్ రెడ్డి కమిషన్ నుంచి కేసీఆర్‌కు మరో లేఖ
తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్ల అంశంపై మరింత సమాచారం ఇవ్వాలని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు విచారణ కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రెండో లేఖ రాశారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానంపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ నరసింహా రెడ్డి జ్యుడీషియల్ కమిషన్ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
గతంలో మొదటి లేఖ రాసి జూన్ 15 లోపు సమాధానం ఇవ్వాలని కోరడంతో 15వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుధీర్ఘ సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత కమిషన్ ముందు పలువురు విద్యుత్ రంగ నిపుణులు, ప్రజాప్రతినిధులు హాజరై తమ వద్ద ఉన్న సమాచారాన్ని జస్టిస్ నరసింహారెడ్డికి తెలియజేశారు.

విద్యుత్ రంగ నిపుణులు, ప్రజాప్రతినిధులు అందజేసిన సమాచారాన్ని, సందేహాలను జోడిస్తూ జస్టిస్ నరసింహా రెడ్డి జూన్ 19న మరోసారి కేసీఆర్‌కు లేఖ రాశారు. జూన్ 27 లోపు సమాధానం అందజేయాలని కోరారు. కేసీఆర్ లేఖ రూపంలో సమాధానం అందజేసినా, వ్యక్తిగతంగా తెలియజేసినా ఎటువంటి అభ్యంతరం లేదని పేర్కొన్నట్లు సమాచారం.
ఇది ఇలావుండగా, విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన తెలంగాణ విద్యుత్ కమిషన్‌పై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని కోర్టులో కేసీఆర్ రిట్ పిటిషన్ వేశారు.
కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని వ్యాజ్యంలో కేసీఆర్ పేర్కొన్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని తెలిపారు. జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్ మీట్‌లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.ఈ కేసులో విద్యుత్ కమిషన్, జస్టిస్ నర్సింహారెడ్డి, ఎనర్జీ విభాగం అధికారులను ప్రతివాదులుగా కేసీఆర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications