దొంగ జగన్, తండ్రి కంటే దుర్మార్గుడు -కేసీఆర్ బతికుండగా అది జరగదు -మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
కృష్ణా నదీ జలాల వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. సరైన వర్షాలు కురవకపోతే ఏపీలో కరువు ఏర్పడే అవకావాలను పెంచుతూ శ్రీశైలం ప్రాజెక్టు వద్ద తెలంగాణ సర్కారు విద్యుత్ ఉత్పత్తిని చేయడాన్ని జగన్ సర్కారు తీవ్రంగా తప్పుపట్టగా, ఏపీకి నష్టం కలిగించే పని తాము చేయడంలేదని, హక్కుల మేరకే నీటిని వాడుకుంటున్నామని కేసీఆర్ ప్రభుత్వం వాదిస్తున్నది. ముఖ్యమంత్రుల స్థాయిలోనే మాటల యుద్ధం మొదలుకావడంతో రెండు రాష్ట్రాల మంత్రులు ఆకాశమే హద్దుగా దూషణలకు దిగుతున్నారు. తాజాగా తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. ఏపీ సీఎం జగన్ పై పరుష పదజాలంతో విమర్శలు చేశారు..

దొంగే దొంగని అరిచినట్లు..
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తోన్న జల విద్యుదుత్పత్తి నిలిపివేయాలంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడాన్ని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి తప్పు పట్టారు. నీటి సమస్యను సృష్టించిన జగనే ఇప్పుడు న్యాయం చేయండంటూ కేంద్రాన్ని కోరడం.. దొంగే దొంగా దొంగా అని అరిచిన చందంగా ఉందని, తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాన్ని పరిష్కరించుకోవాలన్న చిత్తశుద్ధి జగన్ ప్రభుత్వానికి లేదని, కేంద్రానికి లేఖ రాసే పరిస్థితి తెచ్చుకున్నారని, ఏకపక్షంగా వ్యవహరిస్తూ, సమస్య సృష్టించినవారే పరిష్కారం చేయమని అడగడం ప్రజలను మోసం చేయడమేనని జగదీష్ రెడ్డి మండిపడ్డారు.

వైఎస్‌ను మించిన దుర్మార్గం..
ఏపీ సీఎం జగన్ తన తండ్రి వైఎస్సార్ ను మించిపోయి దుర్మార్గానికి పాల్పడుతున్నారని తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి ఆరోపించారు. కృష్ణా నది నీళ్ల దోపిడి విషయంలో జగన్ తండ్రిని మించిపోతున్నాడని మండిపడ్డారు. ఉమ్మడి పాలనలో తెలంగాణ నీటి అవసరాలకు మాజీ సీఎం వైఎస్ఆర్ ఒక్క జీవో ఇవ్వలేదన్న మంత్రి.. పాత పద్దతిలో జగన్ కూడా దుర్మార్గం చేస్తే సహించబోమన్నారు. ఏపీ తీరును నిరసిస్తూ.. తప్పని పరిస్థిహుల్లో కోర్టుకు వెళ్లినా.. కోర్టుని సైతం వైఎస్ జగన్ మోసం చేస్తున్నారని విమర్శించారు. వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకుందామని కేసీఆర్ కోరితే..

కేసీఆర్ బతికుండగా అది జరగదు
''శ్రీశైలం ప్రాజెక్టు వద్ద విద్యుత్ ఉత్పత్తిని ఆపే ప్రసక్తే లేదు. ఎందుకంటే అది తెలంగాణ హక్కు. చట్టపరంగా ఉన్న హక్కులతోనే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. నిజానికి వివాదాల పరిష్కారం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన స్నేహ హస్తాన్ని మరచి ఏపీ సీఎం జగన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. కూర్చొని మాట్లాడుకుందామని కేసీఆర్ చెప్పినా వినకుండా జగన్ మూర్ఖంగా వెళ్తున్నాడు. ఒక్కటి మాత్రం నిజం.. కేసీఆర్ బతికున్నంత కాలం తెలంగాణ హక్కులను ఎవ్వరూ హరించలేరు. తెలంగాణకు రావల్సిన ప్రతి నీటి బొట్టును కాపాడుకుంటాం. కృష్ణా నదిపై ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను వెలంటనే ఆపాలి. రాయలసీమ లిఫ్ట్, పోతిరెడ్డిపాడు వెడల్పు జీవోలను ఉపసంహరించుకోవాలి'' అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications