దసరాకు సొంతూరికి వెళ్తున్నారా? అయితే..ఇవి మర్చిపోవద్దు!
దసరా పండుగ వచ్చిందంటే ప్రతి ఒక్కరూ తమ సొంత ఊర్లకు వెళుతూ ఉంటారు. ఇక దసరా సెలవులకు ఊర్లకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా వుండాలని పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. దసరా సెలవులను పురస్కరించుకొని తమ స్వగ్రామాలు, విహార యాత్రలకు తరలి వెళ్తుండడంతో ఇండ్లల్లో చోరీలను నియంత్రణ చేసేందుకు పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే చోరీల కట్టడికై ప్రజలు సైతం తమ వంతు భాధ్యత నిర్వర్తించాలని పోలీసులు చెప్తున్నారు.
దసరా సెలవులకు వెళ్తున్నారా?
దసరా సెలవుల్లో బయటికి వెళుతున్నప్పుడు ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉండే తాళం, సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్ ను ఏర్పాటు చేసుకోవాలని, అలా ఉంటే దొంగల భయం ఉండదని పోలీసులు చెప్తున్నారు. తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరి స్థానిక పోలీస్టేషన్ లో లేదా మీగ్రామ పోలీస్ అధికారికి సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు నమోదు చేసుకొని వారి ఇళ్లపై నిఘా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే చోరీలకు చెక్
మీ వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కు చేసుకోండి. ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా చైన్స్ తో లాక్ వెయ్యడం మంచిదని చెప్తున్నారు.ఊరికి వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోవాలే తప్ప,పక్కింటి వారికి తెలిసిన వారికి ఇచ్చి మోసపోవద్దని సలహా ఇస్తున్నారు. నమ్మకమైన వ్యక్తులను మాత్రమే వాచ్ మెన్, సెక్యూరిటీ గార్డ్, సర్వెంట్ గా నియమించుకోవాలని సూచిస్తున్నారు.
ఈ పనులు ఊరికి వెళ్తే అసలే చెయ్యొద్దు
సోషల్ మీడియాలో మీ లొకేషన్, ట్రావెల్స్ ప్లాన్స్, ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనే మీ అప్డేట్స్ పెట్టకండి అంటూ హెచ్చరిస్తున్నారు. మీ ఇంట్లో స్వీయ రక్షణ సీసీ కెమెరాలను అమర్చుకోవాలని చెప్తున్నారు. ఆన్ లైన్లో ఎప్పటికప్పుడు మొబైల్ లో మీ ఇంటిని, పరిసరాలను లైవ్, ప్రత్యక్షంగా చూసుకోవచ్చన్నారు. సెక్యూరిటీ సర్వేలైన్స్ కు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయి.
ఇవి తప్పక చేస్తే దొంగతనాల నుండి రక్షణ
ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించాలని చెప్పాలని .ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కర్టెన్ వేయాలి. ఇంట్లో ఏదో ఒక గదిలో లైట్ వేసి ఉంచాలని సూచించారు.ఇంట్లో లేనప్పుడు పని మనుషులు ఉంటే రోజు వాకిలి ఊడ్వాలని చెప్పాలి.ఇంటి ముందు చెత్త చెదారం,న్యూస్ పేపర్స్, పాలప్యాకెట్లు జమ కానివ్వకుండా జాగ్రత్త పడాలి.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే ఇలా చెయ్యండి
పాల ప్యాకెట్ లు, న్యూస్ పేపర్లు కూడా గమనించి నేరస్థులు దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉన్నది, కాబట్టి పాల వాళ్లకు, పేపర్ వాళ్లకు వెయ్యొద్దు అని చెప్పాలి. ఎవరైనా సరే మీ గ్రామం, పట్టణం, కాలనీలో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసు స్టేషన్ కు తప్పనిసరిగా సమాచారం ఇవ్వండి. డయల్ 100కు కాల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రజలు పోలీస్ శాఖ వారి సూచనలు పాటిస్తూ సహకరిస్తే చోరీల నియంత్రించడం సులభం అవుతుందని తెలంగాణా రాష్ట్ర పోలీసులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications