బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ పై హోరాహోరీ వాదనలు!!
పదవ తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసుకు సంబంధించి బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ ను నేడు హన్మకొండ న్యాయస్థానంలోని ధర్మాసనం విచారించింది. బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ పై నేడు హనుమకొండ కోర్టులో వాదనలు వినిపించారు. బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ కు సంబంధించి నేడు గంటకు పైగా వాద ప్రతివాదనలు జరిగాయి.
ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. బండి సంజయ్ తరఫున హై కోర్ట్ అడ్వకేట్ రవిచంద్రన్ వాదనలు వినిపించారు. బండి సంజయ్ బెయిల్ కండిషన్లను ఉల్లంఘిస్తున్నారని, విచారణకు సహకరించడం లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కారణంగానే బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని కోరారు. అయితే బెయిల్ రద్దు చేయడానికి కావలసిన మెరిట్స్ లేవని బండి సంజయ్ తరపు న్యాయవాది తన వాదన వినిపించారు.

పోలీసులు వేసిన బెయిల్ రద్దు పిటిషన్ ను డిస్మిస్ చేయాలని న్యాయమూర్తిని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఈ కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇప్పటికే బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలన్న ప్రభుత్వ పిటిషన్ జిల్లా కోర్టు తిరస్కరించగా, జిల్లా కోర్టు సూచన మేరకే హన్మకొండ నాలుగవ ఎం ఎం కోర్టులో పిటిషన్ పై విచారణ కొనసాగుతుంది.
కాగా పదవ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్ ను ప్రధాన నిందితుడిగా పేర్కొని, ప్రశ్నాపత్రాల లీకేజీ వెనుక ఆయన ప్రధాన సూత్రధారి అని పేర్కొని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను కరీంనగర్ జైలుకు తరలించారు.
ఆపై బెయిల్ పై బండి సంజయ్ బయటకు వచ్చారు. ఆ తర్వాత బండి సంజయ్ కు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఇక ఈ నేపథ్యంలోనే కోర్టు ఈ పిటిషన్ పై విచారణ జరుపుతుంది.












Click it and Unblock the Notifications