సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు.. అధికారులకు కీలక సూచనలు
తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సభ లోపల, బయట ప్రశాంత వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించారు. సభ్యులు కోరిన సమాచారాన్ని వీలైనంత త్వరగా అందించాలని అధికారులకు సూచనలు చేశారు. సభ్యులకు అందించే మెటీరియల్ ను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ముందుగానే అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
అలాగే ధర్నాలు, రాస్తారోకోలు జరగకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండాలని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదేశించారు. ఇంటెలిజెన్స్ సమాచారం వేగంగా అసెంబ్లీ అధికారులకు అందే విధంగా సమన్వయం చేసుకోవాలని సూచనలు చేశారు. సమావేశాల నిర్వహణ కోసం నోడల్ అధికారులను నియమించాలని తెలిపారు.

ఇక స్పీకర్ సూచనలను ఖచ్చితంగా అమలు చేయాలని శాసన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ప్రతి శాఖ నుంచి ఒక సంబంధిత అధికారి ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉభయ సభల సమావేశాలు ప్రభుత్వ కార్యనిర్వాహక వ్యవస్థ సమర్థతకు నిదర్శనమని వివరించారు. ప్రభుత్వం తరఫున సమావేశాలకు పూర్తి స్థాయిలో విజయవంతంగా జరిగేందుకు సహకరిస్తామని స్పష్టం చేశారు. ఈ వర్షాకాల సమావేశాల్లో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టడంతో పాటు, ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న పలు ముఖ్యమైన సమస్యలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు విపక్షాలు కూడా సిద్ధమవుతునట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి వర్షాకాల సమావేశాలు వాడివేడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగుతాయనేది బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశంలో నిర్ణయించనున్నారు.












Click it and Unblock the Notifications