న్యాయవాదిపై దాడి, స్మార్ట్‌ఫోన్ చోరీ: నిందితుల అరెస్ట్, ఇద్దరూ మైనర్లే!
హైదరాబాద్ నగరంలోని ఐమ్యాక్స్ సమీపంలో మంగళవారం న్యాయవాది కళ్యాణ్‌పై దాడి చేసి సెల్‌ఫోన్ అపహరించిన కేసును సెంట్రల్ జోన్ పోలీసులు ఛేదించారు. నిందితులిద్దరూ మైనర్లు అని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు వివరాలను అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్, సైఫాబాద్ ఏసీపీ సంజయ్ వెల్లడించారు.
మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధి గన్‌ఫౌండ్రిలోని ప్రసాద్ అపార్ట్‌మెంట్ వద్ద వాచ్‌మన్‌ను కత్తితో బెదిరించి మొబైల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లారు ఇద్దరు మైనర్లు. అక్కడ్నుంచి ఐమ్యాక్స్ వద్దకు వెళ్లి.. 5 గంటల సమయంలో అక్కడ వాకింగ్ చేస్తున్న న్యాయవాది కళ్యాణ్ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్‌ను ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. కళ్యాణ్ అడ్డుకోవడంతో కత్తితో బెదిరించి దాడికి పాల్పడ్డారు. దీంతో కళ్యాణ్ గాయపడ్డారు.

సెంట్రల్ జోన్ పరిధిలో రెండు ఇదే తరహా కేసులు నమోదు కావడంతో డీసీపీ యాదవ్ నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా రాంనగర్ ఫిష్ మార్కెట్ వద్ద ఓ మైనర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతని వద్ద ఉన్న వాచ్‌మెన్ మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితుడు ఇచ్చిన వివరాల ఆధారంగా చాంద్రాయణగుట్ట బండ్లగూడ వద్ద మరో నిందితుడైన మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
రెండో నిందితుడి వద్ద నుంచి న్యాయవాది కళ్యాణ్ స్మార్ట్ ఫోన్, దాడికి ఉపయోగించిన కత్తి, వారు ఉపయోగించిన హోండా యాక్టివా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుల ఆధార్ కార్డుల వివరాల ప్రకారం వారు మైనర్లు అని తేలిందన్నారు. అయితే, వారి వయసు నిర్ధరించేందుకు ఉస్మానియా ఆస్పత్రిలో టెస్టుల కోసం పంపించామని చెప్పారు. గతంలో ఈ నిందితులపై ఇదే తరహాలో ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ చోరీ కేసు నమదైందని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications