బండి భగీరథ్ పై లుకౌట్ నోటీసులు.. రంగంలోకి నాలుగు బృందాలు
తెలంగాణా రాష్ట్రంలో బండి భగీరధ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మైనర్ బాలికకు లిక్కర్ తాగించి అత్యాచారానికి పాల్పడ్డారన్న ఫిర్యాదుతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ్ పైన కేసు నమోదైంది. మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో నమోదైన పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ దేశం విడిచి వెళ్లకుండా అడ్డుకోవడానికి సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు
అతడిని అదుపులోకి తీసుకునేందుకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు చేపట్టారు. పోక్సో కేసు నిందితుడైన బండి భగీరథ్ చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోవడానికి విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్న సమాచారం అందడంతో పోలీసులు తక్షణమే ఈ చర్యలు చేపట్టారు. దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, సరిహద్దు తనిఖీ కేంద్రాలను అప్రమత్తం చేస్తూ లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు.
బంధువుల ఇళ్లు, స్నేహితుల ఇళ్ళలో సెర్చ్ ఆపరేషన్లు
ఇంతకు ముందు భగీరథ్‌ను విచారణకు పిలిచినా అతడు హాజరు కాలేదు. తానే విచారణకు అన్ని ఆధారాలతో వస్తానని చెప్పిన బండి భగీరధ్ ఇప్పటివరకు విచారణకు హాజరుకాలేదు.దీంతో సిట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన 4 ప్రత్యేక బృందాలు ప్రస్తుతం హైదరాబాద్, కరీంనగర్ మరియు ఢిల్లీలలో భగీరథ్ కోసం తీవ్రంగా వెతుకుతున్నాయి. అతడి బంధువుల ఇళ్లు, స్నేహితుల ఇళ్ళు అన్ని చోట్లా సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి.
కోర్టులో మధ్యంతర ఉత్తర్వులపై తుది నిర్ణయాన్ని వచ్చే వారానికి వాయిదా
మరోవైపు తెలంగాణ హైకోర్టులో భగీరథ్ దాఖలు చేసిన అత్యవసర ముందస్తు బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం రాత్రి సుదీర్ఘ విచారణ జరిగింది. జస్టిస్ టి. మాధవీదేవి ఈ దశలో ముందస్తు బెయిల్ లేదా అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ ఇవ్వడానికి నిరాకరించారు. దర్యాప్తుకు సహకరించాలని సూచించి, మధ్యంతర ఉత్తర్వులపై తుది నిర్ణయాన్ని వచ్చే వారం వాయిదా వేశారు.
పోలీసులు భగీరథ్‌ను ఎప్పుడైనా అదుపులోకి తీసుకునే అవకాశాలు
కోర్టు విచారణలో ఇరు పక్షాల న్యాయవాదుల మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. బాధితురాలి వయసు 18 ఏళ్లలోపు ఉందని, ఆమె మైనర్ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు నిరూపించారు. బాధితురాలి కుటుంబంపై ఒత్తిళ్లు, బెదిరింపులు ఉన్నాయని ఆమె తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు భగీరథ్‌ను ఎప్పుడైనా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని పరిస్థితులు సూచిస్తున్నాయి.














Click it and Unblock the Notifications