ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు బండి సంజయ్ భారీ హామీలు!!
ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు బండి సంజయ్ భారీ హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్- రంగారెడ్డి - హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల కోసం ఉద్యోగ ఉపాధ్యాయులపై ఫోకస్ పెట్టారు.
ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి రావాలి అంటే ఉద్యోగులది కీలకపాత్ర. అటువంటి ఉద్యోగులను, ఉపాధ్యాయులను ప్రసన్నం చేసుకోవడానికి బండి సంజయ్ శత విధాలా ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఈసారి ఎలాగైనా తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలని, కాషాయ జెండా ఎగరవేయాలని ప్రయత్నం చేస్తున్న తెలంగాణ బిజెపి రథసారథి బండి సంజయ్, ప్రస్తుతం మహబూబ్ నగర్- రంగారెడ్డి - హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల కోసం ఉద్యోగ ఉపాధ్యాయులపై ఫోకస్ పెట్టారు.

బీజేపీకి అధికారం ఇస్తే ఒకటవ తేదీన ఉద్యోగులకు జీతాలు: బండి సంజయ్
బండి సంజయ్ ప్రజల మద్దతును సంపాదించడంతోపాటు, ఉద్యోగ, ఉపాధ్యాయుల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు .ఈ క్రమంలో ఆయన తాజాగా మేడ్చల్ జిల్లా దుండిగల్ గండి మైసమ్మ మండలంలోని కొంపల్లి గ్రామంలో జరిగిన ఉపాధ్యాయ, అధ్యాపక ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని వారికి అనేక హామీలు ఇచ్చారు. బిజెపి అధికారంలోకి వస్తే ఒకటవ తేదీన జీతాలు ఇచ్చేలా చర్య తీసుకునే బాధ్యత తనది అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. పెండింగ్ డిఏలు అన్ని నెలలోనే ఇస్తామని, వెంటనే పిఆర్సి వేస్తామని, 317 జీవోన సవరించి ఉపాధ్యాయులకు ఇబ్బంది కలగకుండా స్థానికత ఆధారంగా ఉద్యోగులను, ఉపాధ్యాయులను బదిలీ చేస్తామని హామీ ఇచ్చారు.

బీఆర్ఎస్ కు అవకాశం ఇస్తే మూడు నెలలకోసారి జీతాలు
ఇక ఎవరూ పొరపాటున కూడా బిఆర్ఎస్ పార్టీని గద్దెనెక్కించే ప్రయత్నం చేయొద్దని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఒకవేళ బిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే మూడు నెలలైనా జీతాలు పడవని, మరో ఐదు లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయిస్తారని బండి సంజయ్ ఆరోపించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉపాధ్యాయులకు సంబంధించినవి మాత్రమే కాదని అసెంబ్లీ ఎన్నికల వరకు మరే ఎలక్షన్ లు లేవని తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు కాబోతున్నాయని బండి సంజయ్ పేర్కొన్నారు.

జీతాలు ఇవ్వకపోయినా టీచర్లు ఏం చేస్తారులే అన్నట్టు కేసీఆర్ తీరు
ప్రతి ఒక్కరు ఓటు అనే ఆయుధంతో కేసీఆర్ చెంప చెళ్ళుమనిపించాలని బండి సంజయ్ వారికి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటేసే ముందు ప్రతి ఒక్కరూ ఒక్క క్షణం ఆలోచించాలని పేర్కొన్న బండి సంజయ్, జీతాలు ఇవ్వకపోయినా టీచర్లు ఏం చేస్తారులే అన్న అహంకారం కేసీఆర్ లో ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉద్యోగ, ఉపాధ్యాయులు టీచర్ల సత్తా ఏమిటో చూపించాలని ఆయన పిలుపునిచ్చారు. కెసిఆర్ కంటే గత పాలకులు ఎంతో మేలు అని పేర్కొన్న బండి సంజయ్, గత పాలకుల సమయంలో సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏదైనా హామీ ఇస్తే ఖచ్చితంగా అమలు చేసే వారిని, ఇక ప్రస్తుతం కేసీఆర్ మాత్రం హామీ ఇస్తే అవి అంతే సంగతి అంటూ వ్యాఖ్యలు చేశారు.

కేబినేట్ భేటీలో టీచర్ల సమస్య ప్రస్తావనే లేదు.. అది సీఎం చిత్తశుద్ధి
కెసిఆర్ మాటలన్నీ వట్టి అబద్దాలని పేర్కొన్న బండి సంజయ్ పంజాబ్ కి వెళ్లి చెక్కులు పెంచితే అవి చెల్లలేదంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ క్యాబినెట్ భేటీలో ఇంటి స్థలమున్న నాలుగు లక్షల మందికి మూడు లక్షల చొప్పున డబ్బులు ఇస్తానని, దళిత బంధు ఇస్తానని చెబుతున్న కేసీఆర్ మాటలు ఎవరు నమ్ముతారన్నారు. నిలువ నీడ లేని పేదోళ్లకు ఇల్లు కట్టి ఇవ్వకుండా డబ్బులు ఇస్తామంటే ఎవరు నమ్ముతారు అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఇక టీచర్ల సమస్యను క్యాబినెట్ మీటింగ్ లో కనీసం ప్రస్తావించకపోవడం కెసిఆర్ కు టీచర్ల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు ప్రతి ఒక్కరు కసితో బిఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చిన ఆయన 317 జీవోతో చెట్టుకొకరిని పుట్టకొకరిని చేసే కెసిఆర్ కు తెలంగాణ ఉపాధ్యాయ, ఉద్యోగులు గుణపాఠం చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications