ముదురుతున్న ఈడీదాడుల వ్యాఖ్యల రచ్చ: ట్విట్టర్ టిల్లు కేటీఆర్.. మళ్ళీ బాంబుపేల్చిన బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రజా గోస బిజెపి భరోసా బైక్ ర్యాలీ ల సందర్భంగా తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ త్వరలో సీఎం కేసీఆర్ ఈడీ దాడులు ఎదుర్కొంటారు అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయాలలో సంచలనంగా మారాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ దాడులు ఎదుర్కోక తప్పదు, అందుకే కాంగ్రెస్ తో కెసిఆర్ కలవక తప్పదు అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఇక తాజాగా మళ్లీ కేటీఆర్ కౌంటర్ కు రివర్స్ కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్.

ట్విట్టర్ టిల్లూ.. కేటీఆర్ ను టార్గెట్ చేసిన బండిసంజయ్
ఈడీ చీప్ గా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను నియమించినందుకు ప్రధాని మోడీ కి కృతజ్ఞతలు అంటూ పీఎంవో ను టార్గెట్ చేసి మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఈ క్రమంలోనే మరోమారు బండి సంజయ్ కేటీఆర్ ను ట్విట్టర్ టిల్లు అంటూ టార్గెట్ చేశారు. దర్యాప్తు సంస్థల పేరెత్తగానే దోపిడీదారుల భయం పతాక స్థాయికి చేరుకుంటుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
టెన్షన్ లో ఉంటే యోగా చెయ్యండి .. బండి సలహా
ఇక ట్విట్టర్ టిల్లుకు దొంగల మాదిరిగా భయానికి సంబంధించిన సంకేతాలు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు . ఇదే సమయంలో ఆందోళన అనుభవిస్తున్న వ్యక్తులకు యోగా మంచిది అంటూ సలహా ఇచ్చిన బండి సంజయ్, దర్యాప్తు సంస్థలు మీ తలుపు తట్టే వరకు ఉచ్చ్వాస, నిశ్వాసలు తీసుకుంటూ యోగా చేయండి అంటూ సలహా ఇచ్చారు. అలా చేస్తే టెన్షన్ కాస్తయినా తగ్గుతుందని బండి సంజయ్ సలహా ఇచ్చారు.

బీజేపీ నేతలపై గులాబీ గుండాలతో అడ్డదారిలో దాడులు.. భగ్గుమన్న బండి సంజయ్
ఇక ఇదే సమయంలో మరోమారు కేసీఆర్ ను టార్గెట్ చేసిన బండి సంజయ్ నీ పాలనలో ప్రజలు గోస పడుతుంటే పట్టించుకోవు అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు మేమున్నామని బిజెపి తరఫున ఆ ప్రజలకు భరోసా కల్గిస్తుంటే సహించలేవు అని విమర్శించారు. అధికార దుర్వినియోగం చేస్తూ అడ్డంకులకు పాల్పడుతున్నారని, గులాబీ గుండాలతో అడ్డదారిలో దాడులు చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. మీ నిరంకుశత్వం ఇక చెల్లదు అంటూ పేర్కొన్న బండి సంజయ్ నీ నియంతృత్వం సాలు దొర.. నీకిక సెలవు దొర అంటూ మరోమారు సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.

కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణను తప్పకుండా ఎదుర్కోవాలి .. రెడీ అవ్వమన్న బండి సంజయ్
ఒకప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మాటల దాడికి దిగిన నేతలు ఇప్పుడు మాటకు మాట సోషల్ మీడియా వేదికగానే సమాధానం చెబుతుండడం ప్రధానంగా కనిపిస్తుంది. ట్విట్టర్లో యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్ ను ప్రతిపక్ష పార్టీల నేతలు ట్విట్టర్ పిట్ట అని, ట్వీట్ వీరుడని ఎద్దేవా చేసేవారు. అయితే తాజాగా ట్విట్టర్ టిల్లు అంటూ టార్గెట్ చేస్తూ లేని గొప్పలు కేటీఆర్ చెప్పుకుంటున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. ఇక ఈ క్రమంలోనే కేంద్రంపై, ప్రధాని మోడీ పై సెటైర్లు వేసిన కేటీఆర్ కు బండి సంజయ్ తనదైన శైలిలో చురకలంటించారు. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణను తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ అప్పటిదాకా టెన్షన్ తగ్గించుకోవటానికి యోగా చెయ్యండి అంటూ సలహా ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications