బీఆర్‌ఎస్‌కు జాతీయ అధ్యక్షుడు లేడు.. సొంతరాష్ట్రంలో అధ్యక్షుడు లేకుండా.. ఏపీకి అధ్యక్షుడా?
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడు లేడు. సొంత రాష్ట్రానికి అధ్యక్షుడిని ప్రకటించింది లేదు.. కానీ పక్క రాష్ట్రంలోని నాయకులను పిలిపించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడిని కెసిఆర్ ప్రకటిస్తారట అంటూ ఎద్దేవా చేశారు. కెసిఆర్ ఏపీ నాయకులు పిలిపించుకొని జాయిన్ చేసుకోవడం.. 100 ఎలుకలు తిన్న పిల్లి నంగనాచి లెక్క మాట్లాడడం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్ పిలిచిన కేసీఆర్ కు సిగ్గు లేకుంటే వచ్చిన వాళ్ళకి అయినా సిగ్గు ఉండాలి అంటూ విమర్శలు గుప్పించారు.

ఆంధ్రా వాళ్ళను, ఆంధ్రా బిర్యానీని తిట్టి ఇప్పుడు ఆంధ్రా రాజకీయాలా
గత ఎన్నికలకు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ సెంటిమెంటును రగిల్చాడని, ఆంధ్ర వాళ్ళని తిట్టిపోశాడు అని, ఆంధ్ర బిర్యానీని నానా మాటలు అన్నాడని, ఇప్పుడు అదే ఆంధ్ర బిర్యాని, ఉలవ చారును కేసీఆర్ కు తినిపించాలి అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచి, 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తానని దేశ ప్రజలకు అబద్ధపు హామీలు ఇస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణలో డిస్కంలు నష్టాల్లో ఉన్నాయని అయినా కేసీఆర్ కి అవేవీ పట్టవని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణాలో వ్యవసాయ బోర్లు ఎందుకు పెరిగాయో చెప్పు
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ బోర్లు ఎందుకు పెరిగాయని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రాజెక్టుల నుండి నీరు పంటపొలాలకు చేరితే బోర్లు ఎక్కువగా ఎందుకు వేసుకున్నారో చెప్పాలన్నారు. అసలు తెలంగాణ ప్రాజెక్టులు ఏం చేసావ్ అంటూ మండిపడ్డారు. నీటిని వాడుకునే తెలివి నీకు అసలు ఉందా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. ఇక పాఠశాల విద్యలో తెలంగాణ చివరి గ్రేడ్ లో ఉందని ఏమీ అభివృద్ధి చేశారో చూపించాలంటూ బండి సంజయ్ విమర్శించారు.

మద్యం అమ్మకాల్లోనే రాష్ట్రం అభివృద్ధి
రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందని, రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని.. కెసిఆర్ ఇంకా ఎక్కడ ఉన్నాడు అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా 2014లోనే ఉన్నాడు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు కెసిఆర్ మైండు అప్డేట్ కాలేదని బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి సాధించింది అంటే మద్యం అమ్మకాలలో అభివృద్ధి సాధించిందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. మద్యం ఆదాయం 10 వేల కోట్ల నుండి 44 వేల కోట్ల రూపాయలకు పెరిగిందని బండి సంజయ్ పేర్కొన్నారు.

కేసీఆర్ డీఎన్ఏ లోనే తేడా
ఆయుధాలు ఎగుమతి చేస్తున్నామని, వంద దేశాలకు వాటిని సరఫరా చేశామని ఇది దేశం సాధించిన ప్రగతి కాదా అంటూ ప్రశ్నించిన బండి సంజయ్ తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు పెద్ద కుట్ర అంటూ మండిపడ్డారు. కెసిఆర్ డిఎన్ఏ లోనే తేడా ఉందని పేర్కొన్న బండి సంజయ్ భారతదేశంలో భారత బజార్ లు ఎందుకు ఉంటాయో చెప్పాలన్నారు. చైనా, అమెరికా వంటి దేశాలలో భారత్ బజార్లు ఉంటాయని తెలంగాణలో తెలంగాణ బజార్లు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు.

నువ్వు తోప్ నాథ్ షిండేవా ?
మైసూర్ పాక్ మైసూర్ లో తయారవుతుందా అంటూ ఎద్దేవా చేశారు. ఇక ఇతర రాష్ట్రాలలో ని ఎమ్మెల్యేలు తనకు టచ్లో ఉన్నారని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ బండి సంజయ్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారా? నువ్వు తోప్ నాథ్ షిండే వా అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఏపీ రాజకీయాలపై తనదైన శైలిలో బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications