కేంద్రం లేఖతో తెలంగాణకు భారీ ఊరట: రూ. 1257 కోట్ల బేవరేజెస్ నిధులు వెనక్కి
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ ఆదాయ పన్ను బకాయిలు చెల్లించడం లేదన్న సాకును చూపి రాష్ట్ర ఖజానా నుంచి ఆర్‌బిఐ మళ్లించిన రూ.1257 కోట్లను తిరిగి తెలంగాణ సర్కారు ఖాతాకు జమ చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది.
తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ ప్రత్యేక సంస్థ అనీ, ఆ సంస్థకు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి సంబంధం లేదని నిర్ధారించామని కేంద్రం పేర్కొంది. దీంతో మళ్లించిన నిధులను 2, 3 రోజుల్లో వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.
ఈ మేరకు తెలంగాణ సర్కారుకు కేంద్రం లేఖ ద్వారా సమాచారమందించింది. కాగా, నిధుల మళ్లింపు కారణంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా కుదుపునకు గురైంది. కేంద్రం తాజా నిర్ణయం తెలంగాణ సర్కారుకు భారీ ఊరటనిచ్చే విషయంగానే చెప్పుకోవచ్చు.

రాష్ట్ర ప్రభుత్వానికి మాటమాత్రంగానైనా సమాచారం ఇవ్వకుండా జరిగిన ఈ నగదు బదిలీ కారణంగా రెండు నెలల పాటు రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. ఉద్యోగుల వేతనాలు మినహా 'మిషన్ కాకతీయ' పనుల చెల్లింపులను కూడా నిలిపివేయాల్సి వచ్చింది.
తక్షణమే ఆ నిధులను వెనక్కివ్వాలని పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోలేదు. అయితే ఎట్టకేలకు కేంద్రం, తెలంగాణ సర్కారు మొరను ఆలకించింది. బేవరేజెస్ కార్పొరేషన్ పన్ను ఖాతా కింద జమ చేసుకున్న నిధులను వెనక్కి ఇచ్చేయనున్నట్లు మంగళవారం తెలంగాణ సర్కారుకు కేంద్రం లేఖ రాసింది.












Click it and Unblock the Notifications