ఐదుగురు విద్యార్థినులపై అత్యాచారం... కీచక టీచర్‌కు 21 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు...
సమాజంలో రోజురోజుకు స్త్రీలపై నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు సైతం అత్యాచార ఘటనలకు తెగబడుతుండటం ఆందోళన కలిగించే విషయం. గతేడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఐదుగురు విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో తాజాగా అతనికి కోర్టు 21 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.11 వేలు జరిమానా విధించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం చింతవర్ర గామంలోని ప్రాథమిక పాఠశాలలో దొడ్డా సునీల్‌కుమార్ (40) సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. గతేడాది కరోనా కారణంగా స్కూళ్లు మూతపడినప్పటికీ... సునీల్ కుమార్ ప్రైవేట్ క్లాసుల పేరిట కొంతమంది విద్యార్థినులను స్కూలుకు రప్పించేవాడు. ఆ సమయంలో ఐదుగురు విద్యార్థినులపై అతను అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలున్నాయి. బాధిత బాలికల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేసు వెలుగుచూసింది. దీంతో పోలీసులు సునీల్ కుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ఐపీఎస్ అధికారి వినీత్ ఈ కేసుపై విచారణ జరిపారు. తాజాగా కొత్తగూడెంలోని పోక్సో ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ నిందితుడు సునీల్ కుమార్‌ను దోషిగా తేల్చారు. అతనికి 21 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ. 11 వేల జరిమానా విధించారు.
గిరిజన బాలికపై అత్యాచారం :
ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో పదేళ్ల గిరిజన బాలిక అత్యాచారానికి గురైంది. బాధితురాలు తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గిరిజన గ్రామంలో ఆమె నివసిస్తోంది. తండ్రి చనిపోవడంతో బాధిత బాలిక తల్లి మరో పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో అతని కన్ను బాలికపై పడింది. తండ్రి స్థానంలో ఉండి కూడా ఆమె పట్ల అతను కామాంధుడిలా ప్రవర్తించాడు. తల్లి ఇంట్లో లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తన తల్లికి ఈ విషయం చెప్పగా... ఇద్దరు కలిసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Recommended Video
మరో ఘటనలో గుంటూరు జిల్లా శివారులో ఓ యువతిపై అత్యాచారం జరిగింది.గొర్లవారిపాలెం డొంకరోడ్డులో ఈ నెల 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గోరంట్ల గ్రామానికి చెందిన గోపయ్య అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.