మేం అధికారంలోకి వస్తే ఇల్లు కట్టుకోవటానికి 5లక్షలిస్తాం!!
కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని సిఎల్ పి నేత భట్టి విక్రమార్క తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో సి ఎల్ పి నేత భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా హనుమంతుని పేట మంగపేట, కాల్వ శ్రీ రాంపూర్ మండలం లోని శ్రీరాంపూర్, ఇప్పలపల్లి గుంపుల గ్రామాలలో స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి పర్యటిస్తున్నారు.
పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్బంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యేపై మండిపడ్డారు. పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అక్రమంగా దందాలు చేస్తూ ఆర్ధికంగా లబ్ది పొందుతున్నారని మండిపడ్డారు. ఒక ప్రక్క ఇసుక, మట్టి దోచుకోవడంతో పాటు విద్యను కూడా వ్యాపారం చేస్తూ దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రం వస్తే పేద ప్రజల కష్టాలు తొలగుతాయని ప్రజలు భావించారు కానీ నాయకులు బాగుపడుతున్నారు అని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఈ ప్రాంత సహజ వరనులను అమ్ముకొని, అడ్డు వచ్చిన వారిపై అక్రమ కేసులు పెడుతూ పెద్దపల్లికి తలవొంపులు తీసుకువస్తున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఇస్తే వచ్చిన తెలంగాణ ను అప్పుల పాలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని విమర్శించారు. తెలంగాణ ప్రజలను అర్ధం చేసుకొని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రాష్ట్రాన్ని పాలిస్తే మీకు కష్టాలు వచ్చేవి కావు అన్నారు.
2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కట్టుకోవడానికి 5లక్షల రూపాయలు ఇస్తామన్నారు. స్థలం లేని వారికి స్థలాలు ఇస్తామని అలాగే రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, 500 కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications