Telangana: కాస్త వీటి సంగతి చూడండి!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఢిల్లీలోని ఆమె నివాసంలో శనివారం తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కలిశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ అంశాల్లో రావాల్సిన ఆర్థిక వనరులు, నిధులకు సంబంధించిన విజ్ఞప్తులను అందజేశారు. గతంలో ఈ అంశాలకు సంబంధించి రాసిన లేఖలను కూడా అందజేశారు.
వివిధ కార్పొరేషన్‌లు/SPVల ఋణ పునర్వ్యవస్థీకరణ (Restructuring of Debt) - ఆర్థిక సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా కేంద్రమంత్రిని భట్టి విక్రమార్క కోరారు. తెలంగాణ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ. 4,08,48,54,461 తిరిగి చెల్లింపును వేగవంతం చేయాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 కింద, విభాగం 94(2) ప్రకారం, తెలంగాణకు రావలసిన వెనుకబాటుగా ఉన్న జిల్లాల కోసం ప్రత్యేక సహాయ నిధి విడుదల చేయాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం ప్రభుత్వ పథకాల నిధుల విడుదలలో జరిగిన కేటాయింపు పొరపాటు సరిచేయాలని విజ్ఞప్తి చేశారు డిప్యటీ సీఎం భట్టి విక్రమార్క.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 లోని విభాగం 56(2) ప్రకారం రూ. 208.24 కోట్లు తిరిగి చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెలంగాణ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కేటాయించిన అదనపు బాద్యత (Excess Liability) మేరకు అందుకోవలసిన మొత్తానికి సంబంధించిన అంశంపై కేంద్రమంత్రితో చర్చించారు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 కింద నిధుల బదిలీ (Transfer of Funds) కోరుతూ కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పవర్ యుటిలిటీల మధ్య పెండింగ్‌లో ఉన్న బకాయిల పరిష్కారం చేయాలని కేంద్రమంత్రిని డిప్యటీ సీఎం కోరారు. డిప్యూటీ సీఎంతోపాటు ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications