'భూ భారతి' సేవలు ఏంటి ? ఛార్జీలు ఎంతో తెలుసా ?
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి పోర్టల్ ఏప్రిల్ 14 నుంచి ప్రారంభమైంది. భూ భారతి పోర్టల్‌ను హైదరాబాద్శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు. తొలుత పైలట్ ప్రాజెక్ట్ గా ఈ పోర్టల్ ను ప్రయోగాత్మకంగా 4 మండలాల్లో అమలు చేయనున్నారు. మద్దూరు (నారాయణపేట జిల్లా), లింగంపేట (కామారెడ్డి), వెంకటా పూర్ (ములుగు), నేలకొండపల్లి (ఖమ్మం) మండలాలను ఎంపిక చేశారు. జూన్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఈ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
రైతులు తమ భూముల వివరాలను తెలుసుకునేందుకు వీలుగా bhubharati.telangana.gov.in అధికారిక వెబ్‌సైట్ ను రూపొందించారు. అయితే ప్రస్తుతానికి రాష్ట్రంలోని 4 మండలాల్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇంతకీ ఈ పోర్టల్ ద్వారా ఏం సేవలు పొందొచ్చు ? ఛార్జీలు ఎంత ?

భూ భారతి పోర్టల్ ద్వారా రైతులకు కొత్త పాస్ పుస్తకాలను జారీ చేయనున్నారు. భూమి యజమాని రూ.300 చెల్లించి దరఖాస్తు చేయాలి. అప్పుడు సర్వే చేసి.. మ్యాప్ ను రూపొందించి పట్టా పాస్‌బుక్ ను అధికారులు అందజేస్తారు. వివరాల్లో ఏమైనా లోపాలు ఉంటే MRO సరిదిద్దుతారు. ఎమ్మార్వో నిర్ణయంపై అభ్యంతరం ఉంటే ఆర్డీవోకు, తదుపరిగా కలెక్టర్ స్థాయిలో అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇక కలెక్టర్ తీసుకునే నిర్ణయంపైనా అభ్యంతరాలుంటే భూ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు.
ఇక మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ఉచిత న్యాయసహాయం అందించేందుకు భూ భారతి చట్టంలో ప్రత్యేకంగా నిబంధనలను చేర్చారు. అవసరమైన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు రూ.100 జరిమానా చెల్లిస్తే, వాటిని లీగల్‌గా చేర్చే అవకాశం కల్పించారు. దీంతో భూ భారతి పోర్టల్ ద్వారా భూ వివాదాలకు తక్షణ పరిష్కారం లభిస్తుంది. అంతేకాక గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణకు భూ భారతిలో ప్రత్యేక నిబంధన తీసుకొచ్చారు. ఈ రూల్ ప్రకారం.. ప్రతి ఏడాది డిసెంబర్ 31న గ్రామ రికార్డులను భూ భారతి పోర్టల్ లో అప్‌డేట్ చేసి భద్రపరుస్తారు.
ఫీజులివే..
భూమి యజమాని రూ. 300 చెల్లించి దరఖాస్తు చేస్తే పట్టాదారు పాసు పుస్తకం ఇస్తారు. భూ భారతి పోర్టల్ లో నిర్దేశించిన నమూనాలో మ్యుటేషన్ దరఖాస్తు కోసం ఎకరానికి రూ.2500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన గుంటకు రూ.62.50 పడుతుంది. రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించిన స్టాంప్ డ్యూటీ ప్రకారం రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాలి. ఇది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. భూ యజమాని రికార్డుల్లో తప్పుల సవరణ దరఖాస్తుకు రూ. 1000 ఫీజు చెల్లించాలి.
భూ భారతితో ఇక భూముల లెక్క పక్కా.. pic.twitter.com/1LeqyxQvQK
— Telangana Congress (@INCTelangana) April 15, 2025
భూ హక్కులతో పాటు అధికారులు ఇచ్చిన రికార్డుల్లో తప్పులుంటే అప్పీల్ కు వెళ్లే అవకాశం ఉంది. ఇందుకోసం రూ.1000 చెల్లించాలి. స్లాట్ బుకింగ్ ద్వారానే భూ భారతి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. అనుకున్న సమయానికి స్లాట్ రాకపోతే మార్పులు చేసుకోవచ్చు. మొదటిసారి ఉచితంగానే మార్పు చేసుకోవచ్చు. రెండోసారి స్లాట్ మార్చుకునేందుకు రూ.500 చెల్లించాలి. మూడోసారి అయితే రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications