మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్!
కొండ సురేఖ దంపతులు కోరి కోరి కష్టాలను కొని తెచ్చుకున్నారా? సొంత పార్టీ నేతల మీద అనవసరమైన వ్యాఖ్యలు చేసి దుమారం రేపిన కొండ సురేఖ దంపతులు, అనవసరమైన విషయాలను ప్రస్తావించి ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలకు కూడా టార్గెట్ అయ్యారా? తాము ఎవరికీ భయపడము అంటూనే కొద్దికొద్దిగా భయం గుప్పిట్లో చిక్కుకుంటున్నారా? అంటే అవునని చెప్పక తప్పదు.
కొండా మురళి గత ఎన్నికల ఖర్చు వ్యాఖ్యలు
ఓవైపు క్రమశిక్షణ కమిటీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి గడువు దగ్గర పడుతున్న తరుణంలో మరోవైపు ఎన్నికల సంఘానికి కొండా సురేఖ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ ఫిర్యాదు చేయడం కొండా సురేఖ దంపతులకు తలనొప్పిగా మారింది. కొండ మురళి ఇటీవల వరంగల్లో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తమకు 500ఎకరాల భూమి ఉందని అందులో 16ఎకరాల భూమిని అమ్మి గత అసెంబ్లీ ఎన్నికలలో 70కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు.

సురేఖ శాసనసభ్యత్వం రద్దు చెయ్యాలని ఫిర్యాదు
తమకు ఎవరి డబ్బులు అవసరం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి చేసిన వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ వీడియోల ఆధారంగా హైదరాబాద్లోని ఎన్నికల సంఘం కార్యాలయంలో బిజెపి నాయకులు ఫిర్యాదు చేశారు. 2023 ఎన్నికలలో తప్పుడు అఫిడవిట్ సమర్పించిన వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి కొండా సురేఖ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు చేసిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు
తెలంగాణరాష్ట్ర ఎన్నికల ఉప ప్రధాన అధికారి హరి సింగ్ కు బిజెపినేత, వరంగల్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు విజ్ఞప్తి చేశారు. కొండ మురళి చేసిన వ్యాఖ్యలపైన విచారణ జరిపించాలని ఆయన కోరారు. తక్షణం ఈ వ్యవహారంపైన చర్యలు తీసుకోవాలని వారు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఒకపక్క కొండ మురళి చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన క్రమంలో లాక్కోలేక పీక్కోలేక సతమతమవుతున్నారు.
దగ్గర పడుతున్న క్రమశిక్షణ కమిటీ డెడ్ లైన్
ఇక ఇదే క్రమంలో ఐదో తారీకుతో క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన డెడ్లైన్ కూడా ముగియనున్న నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీకి ఏం సమాధానం ఇవ్వాలి అన్న దానిపైన కూడా తర్జనభర్జన పడుతున్నారు. క్రమశిక్షణ కమిటీకి సమాధానం ఇవ్వకపోతే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సమాధానం ఇస్తే, అది ఏ విధంగా ఇవ్వాలి అనేది ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది.
తలనొప్పులు ఫేస్ చేస్తున్న కొండా దంపతులు
ఏది ఏమైనా రాజకీయాలలో కీలక పదవిలో ఉన్నప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే వచ్చే తలనొప్పులను ఫేస్ చేయాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉంటుంది. ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ దంపతులు అటువంటి పరిస్థితులను ఫేస్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications