సూర్యాపేట మున్సిపల్ బరిలో గల్వాన్ వీరుడి మాతృమూర్తి.. ఆ పార్టీ తరఫున నామినేషన్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. దాంతో అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి కేంద్రీకరించాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. అయితే సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 2020లో గల్వాన్ వ్యాలీలో చైనా ఆర్మీతో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.
అయితే కల్నల్ సంతోష్ బాబు మాతృమూర్తి బిక్కమల్ల మంజుల సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు BRS తరఫున ఆమె తన నామినేషన్ పత్రాన్ని అధికారికంగా దాఖలు చేశారు. సూర్యాపేట పట్టణ 44వ వార్డు నుంచి ఆమె పోటీ చేయనున్నారు. తన కుమారుడు సరిహద్దుల్లో దేశానికి సేవలందిస్తే, తాను స్థానిక ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం పని చేయాలని నిర్ణయించుకున్నట్లు మంజుల స్పష్టం చేశారు. అభివృద్ధి పథంలో భాగస్వామ్యం కావాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే బలమైన సంకల్పంతోనే తాను ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు.
ఈ మేరకు రాజ్యసభ మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్.. బిక్కమల్ల మంజులకు బీ- ఫార్మ్ అందించారు. పార్టీ కార్యకర్తలు, ముఖ్య నేతలతో కలిసి ఆమె తన నామినేషన్ పత్రాన్ని అధికారికంగా దాఖలు చేశారు. తన నామినేషన్ పేపర్లను రిటర్నింగ్ ఆఫీసర్ కు సబ్ మిట్ చేశారు.

ఇక 2020 జూన్ లో గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన భీకర ఘర్షణల్లో భాగంగా కల్నల్ సంతోష్ బాబు తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి వీరమరణం పొందారు. ఆయన ధైర్యసాహసాలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2021లో దేశంలోనే రెండో అత్యున్నత సైనిక పురస్కారమైన 'మహావీర్ చక్ర' తో గౌరవించింది. అయితే అమరవీరుడి కుటుంబం పట్ల ప్రజల్లో ఉన్న అపారమైన గౌరవం, సానుభూతి ఇప్పుడు బిక్కమల్ల మంజులకు ఎన్నికల్లో సానుకూల అంశంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications