స్మిత సబర్వాల్ ఎమోషనల్: ఇది స్వేచ్ఛాయుత దేశం అంటే నమ్మకం కలగట్లేదంటూ
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో దోషులకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా గుజరాత్‌లో అధికారంలో ఉన్న భారతీయ జనత పార్టీ ప్రభుత్వం- జైలు నుంచి విముక్తి కల్పించడం పట్ల రోజురోజుకూ దుమారం ముదురుతోంది. ఇప్పటికే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ దీనిపై స్పందించారు.
కేటీఆర్..
వారితో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నాయకులు దీనిపై ఘాటు విమర్శలు గుప్పించారు. గుజరాత్ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. బిల్కిస్ బానోపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను గుజరాత్ బీజేపీ ప్రభుత్వం జైలు నుంచి విడిచిపెట్టడం ద్వారా సభ్య సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తోందని ప్రశ్నించారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం మొత్తం సంబరాలు జరుపుకొంటోన్న వేళ.. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని వ్యాఖ్యానించారు.

బిల్కిస్ బానోపై..
2002లో గోధ్రా రైలు దగ్ధం అనంతరం గుజరాత్‌లో చోటు చేసుకున్న అల్లర్ల సందర్భంగా బిల్కిస్ బానో అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె అయిదు నెలల గర్భిణి. ఆమె మూడేళ్ల కుమార్తె సహా ఏడుమంది కుటుంబ సభ్యులను అల్లరి మూకలు దారుణంగా హత్య చేశాయి. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాయి. ఈ కేసులో శిక్షను అనుభవిస్తోన్న వారిని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం జైలు నుంచి విడిచిపెట్టింది.
నమ్మకం కలగట్లేదు..
దీనిపై తాజాగా తెలంగాణకు చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారిణి, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మిత సబర్వాల్ స్పందించారు. రేపిస్టులను జైలు నుంచి విడిచి పెట్టడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒక మహిళగా, సివిల్ సర్వెంట్‌గా తాను ఈ వార్తను చూసిన తరువాత నమ్మలేకపోయానని చెప్పారు. స్వేచ్ఛాయుత దేశంలో ఉన్నాననే నమ్మకం తనకు కలగట్లేదని వ్యాఖ్యానించారు. ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా, స్వేచ్చగా ఊపిరి పీల్చుకునే ఆమె హక్కును మనం మళ్లీ తుడిచిపెట్టినట్టయిందని పేర్కొన్నారు.

బిల్కిస్ బానో ఆవేదనను ప్రతిబింబించేలా..
ఈ పరిణామం బిల్కిస్ బానో స్వేచ్ఛను హరించినట్టయిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం స్వేచ్ఛా దేశంగా పిలుచుకోలేమని స్మిత సబర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు. బిల్కిస్ బానో తరఫు న్యాయవాది శోభ విడుదల చేసిన ఓ ప్రెస్‌నోట్‌ను తన ట్వీట్‌కు జత చేశారు. 20 సంవత్సరాలుగా తను అనుభవిస్తోన్న గాయాల బాధ మరోసారి చెలరేగిందని బిల్కిస్ బానో చెప్పారు. తన జీవితాన్ని, కుటుంబాన్ని ఛిద్రం చేసిన 11 మంది దోషులు జైలు నుంచి విముక్తులు అయ్యారని తెలిసి, మాటలు రావట్లేదని పేర్కొన్నారు. మూడేళ్ల కుమార్తెను దూరం చేసిన వారందరూ సమాజంలో అడుగు పెట్టారని అన్నారు.

స్వేచ్ఛగా జీవించగలనా?
దేశ చట్టాలు, న్యాయస్థానాలు, వ్యవస్థల మీద తనకు అపారమైన నమ్మకం ఉండేదని, వారిని స్వేచ్ఛా సమాజంలోకి విడిచి పెట్టిన తరువాత తానెలా ధైర్యంతో జీవించ గలుగుతానని బిల్కిస్ బానో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ 11 మందిని విడిచిపెట్టడానికి ముందు- వారి వల్ల తీవ్రంగా నష్టపోయిన తన అభిప్రాయాన్ని, భద్రతను ఎవరూ తీసుకోలేదని చెప్పారు. తాను స్వేచ్ఛగా ఈ సమాజంలో జీవించే హక్కును గుజరాత్ ప్రభుత్వం కల్పించాలని కోరారు.












Click it and Unblock the Notifications