2023లో పవర్ కోసం బీజేపీ పవర్ ఫుల్ పాలిటిక్స్; మిషన్ తెలంగాణాపైనే ఫోకస్!!
తెలంగాణ రాష్ట్రంలో 2023 ఎన్నికలను టార్గెట్ చేసుకొని కమలదళం బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుందా? తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టాలని బిజెపి ఇప్పటి నుంచే రంగంలోకి దిగిందా? టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ నే అని చెప్పడం కోసం ప్రజాక్షేత్రంలోకి వెళుతుందా? రాష్ట్రంలో టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టు సమరం సాగుతున్న వేళ వచ్చే ఎన్నికల సమరశంఖం ఇప్పటి నుంచే పూరిస్తుందా ? బీజేపీ మిషన్ తెలంగాణా కొనసాగుతుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

తెలంగాణాలో అప్పుడే ఎన్నికల వేడి... 2023 ఎన్నికల టార్గెట్ గా బీజేపీ వ్యూహం
తెలంగాణా రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి కొనసాగుతుంది. ఇప్పటికే తెలంగాణా సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల వ్యూహాలను ఇప్పటి నుండే సిద్ధం చేస్తుంటే ఇప్పటి నుంచే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ సైతం నిర్ణయించింది. అసెంబ్లీకి 2023 మొదటి ప్రథమార్థంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న బీజేపీ ప్రజల మద్దతును కూడగట్టడానికి, ఇప్పటి నుంచే పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని నిర్ణయం తీసుకుంది.
సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని ప్రకటన చేసిన నేపథ్యంలో, కెసిఆర్ కచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళతారని భావిస్తున్న బీజేపీ ఎన్నికలకు ముందు హడావుడిగా జనాల్లోకి వెళ్లకుండా, ఇప్పటి నుంచే పకడ్బందీ ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది.

అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయాల దిశగా బీజేపీ
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకుంటున్న బీజేపీ నేతలు, ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీల వారీగా ఉన్న ప్రధానమైన నాయకులు, సామాజిక సమీకరణాలు, పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు, వారి బలాబలాలు, తదితర అంశాలపై అధ్యయనం పూర్తి చేశారు.
వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే అభ్యర్థులను రెడీ చేసుకునే పనిలో పడ్డారు. చివరి నిముషంలో అభ్యర్థుల కోసం వెతుక్కోకుండా ఇప్పటి నుండే అభ్యర్థిని ప్రజా క్షేత్రంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ లో బలమైన నాయకులు ఉన్న స్థానాలలో వారికే టికెట్లు కేటాయించాలని, లేని చోట పార్టీలో బలమైన నాయకులను బిజెపి బాట పట్టించడానికి ప్రయత్నాలు చేయాలని నిర్ణయించింది.

బైక్ ర్యాలీలు, పాదయాత్రల కార్యక్రమాలతో ప్రజల్లోకి బీజేపీ
ఇందులో భాగంగా బిజెపి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లేందుకు అనేక కార్యక్రమాలను తీసుకొని ముందుకు సాగుతుంది. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 26వ తేదీ నుండి డిసెంబర్ 14వ తేదీ దాకా వివిధ లోక్సభ నియోజకవర్గాలలో, అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రజా గోస బీజేపీ భరోసా పేరుతో బైక్ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది.
ఇక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సత్తా చాటడం కోసం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో చెప్పడం కోసం బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఐదవ విడత ఈనెల 28వ తేదీ నుంచి వచ్చేనెల 17వ తేదీ వరకు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పరిధిలో నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది.

క్షేత్రస్థాయిలో బలోపేతం కావటానికి బీజేపీ వ్యూహాలు.. వేగంగా అడుగులు
దీంతోపాటు రాష్ట్రంలో ప్రధాన సమస్యలపై ఆందోళనలు, ధర్నాలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయం తీసుకుంది. పోలింగ్ బూత్ స్థాయి నుండి టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసేలా కార్యాచరణ రూపొందించి అన్ని స్థాయిలలో పార్టీని బలోపేతం చేయడానికి బిజెపి నాయకులు రంగంలోకి దిగారు. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయాలని సంకల్పంతో ఉన్న బిజెపి అగ్రనేతల ఆలోచనలను కొనసాగించడానికి కమల దండు కార్యక్షేత్రం లోకి శరవేగంగా దూసుకెళ్తున్నారు.












Click it and Unblock the Notifications