తెలంగాణలో ఎన్నికల వేళ అమిత్ షా నయా స్ట్రాటజీ..!?
తెలంగాణలో ఎన్నికల వేళ అమిత్ షా కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు.
తెలంగాణలో బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలనేది బీజేపీ లక్ష్యం. తాజాగా తెలంగాణ ఢిల్లీ నేతలను పిలిపించిన అమిత్ షా వారికి క్లాస్ తీసుకున్నారు. నేతలు విభేదాలు పక్కన పెట్టి గెలుపు కోసం పని చేయాలని నిర్దేశించారు. పార్టీలో చేరికలపైన దిశా నిర్దేశం చేసారు. ఇదే సమయంలో తానే స్వయంగా తెలంగాణ బాధ్యతలను పర్యవేక్షించాలని నిర్ణయించినట్లు కనిపిస్తోంది.
ఇందుకోసం కర్ణాటక ఎన్నికల తరువాత స్వయంగా రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. ఇక..అమిత్ షా తెలంగాణలో మకాం వేసి..ఎన్నికల్లో విజయం కోసం వ్యూహాలు అమలు చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే జరిగితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయంగా మరింత ఆసక్తి కరంగా మారటం ఖాయం.

తెలంగాణ పై బీజేపీ గురి..
తెలంగాణలో మరి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి జరిగే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనేది బీజేపీ లక్ష్యం. ఇందుకోసం ఇప్పటికే ప్రధాని మోదీ..అమిత్ షా ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. ఈ నెల 12న అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఆ తరువాత మరిన్ని పర్యటనలకు ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి.
అన్ని జిల్లాల్లో పార్టీ ముఖ్య నేతల పర్యటనలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రధాని మోదీని ఆహ్వానించి రాష్ట్ర స్థాయి బహిరంగ సభ ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే పార్టీ రాష్ట ఇంఛార్జ్ తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్, బీఎల్ సంతోష్ నిరంతరం తెలంగాణ రాజకీయ వ్యవహారం పైన మంతనాలు చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర నేతలకు మార్గ నిర్దేశం కొనసాగిస్తున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే స్వయంగా తెలంగాణ పార్టీ వ్యవహారాలను సమీక్షిస్తున్నారు. దక్షిణాదిన రెండు కీలక రాష్ట్రాలుగా భావిస్తున్న కర్ణాటక..తెలంగాణలో ఇప్పుడు షా స్పెషల్ ఫోకస్ కు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

తెలంగాణ వేదికగా అమిత్ షా మంత్రాంగం
కర్ణాటకలో అధికారం నిలబెట్టుకోవటం బీజేపీ అధినాయత్వం ప్రాధాన్యత ఇస్తోంది. అక్కడ పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలే ప్రధాన సమస్యగా భావిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అక్కడ అధికారం కోసం కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. దీంతో..అమిత్ షా కర్ణాటక లో పార్టీ గెలుపు బాధ్యతలు తీసుకున్నారు. నిరంతరం రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్నారు.
పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. కర్ణాటకలో ఎన్నికల కోసం స్కెచ్ రెడీ చేస్తూనే ఇటు తెలంగాణలోనూ పార్టీ పరిస్థితుల పైన షా ఆరా తీస్తున్నారు. అమిత్ షా బెంగళూరులోనే ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఉంటారని పార్టీలో చర్చ జరుగుతోంది.
ముందుగా కర్ణాటక..ఆ తరువాత తెలంగాణలో అమిత్ షా ఆపరేషన్ ప్రారంభం కానుంది. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించకుండా అడ్డుకోవటమే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది.

అన్ని జిల్లాల్లో షా పర్యటనలు - సభలు
కర్ణాటక-తెలంగాణ రెండు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా అమిత్ షా కార్యాచరణ ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే తమ లక్ష్యం ఏంటో తెలంగాణ నేతలకు బీజేపీ నాయకత్వం స్పష్టం చేసింద. పార్టీలో చేరికలు లేకపోవటం పైన ఆరా తీసింది. రాష్ట్ర నేతలకు చేరిక సమయంలో నేతలకు ఇచ్చే హామీల అమలు దిశగా స్వేచ్చను ఇచ్చింది.
అటు తెలంగాణ కాంగ్రెస్ లో కొంత మార్పు కనిపిస్తోంది. ఈ సమయంలో బీజేపీ మరింత అప్రమత్తం అయింది. బీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు పార్టీ నేతలకు ఎప్పటికప్పడు రూట్ మ్యాప్ అందిస్తున్నా.. స్వయంగా తానే రంగంలోకి దిగాలని అమిత్ షా డిసైడ్ అయ్యారని చెబుతున్నారు. ఇందు కోసం ఆయన తెలంగాణలోని ప్రతీ జిల్లాలోనూ పర్యటించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. సభలు నిర్వహించనున్నారు.
ప్రధాని మోదీ, నడ్డా, అమిత్ షా ముగ్గురు అగ్ర నేతలు తెలంగాణ లో పార్టీ కోసం ఇక ప్రత్యేకంగా ఫోకస్ చేస్తారని సమాచారం. మరి..బీజేపీ నాయకత్వం వ్యూహాలు తెలంగాణ లో ఏ మేర ఫలిస్తాయో చూడాలి.












Click it and Unblock the Notifications