అమిత్ షా తేల్చేసారు - రాజగోపాల్ పైనే భారం : ఈ ముగ్గురే కీలకం..!!
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మునుగోడు చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పటికే రాజగోపాల్ రాజీనామా ఆమోదంతో పార్టీలు అభ్యర్ధుల ఖరారు పైన ఫోకస్ పెట్టాయి. బీజేపీ నుంచి రాజగోపాల్ బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలోని తన మద్దతు దారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 21న కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభ పైన కొంత డైలమా కొనసాగుతోంది. వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

రాజగోపాల్ పైనే బీజేపీ భారం
అయితే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఈ నెల 21న అమిత్ షా మునుగోడు వస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. అదే రోజున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారికంగా బీజపీలో చేరనున్నారు. మరి కొంత మంది నేతలు అదే సభలో కాషాయం కండువా కప్పుకోనున్నారు.
కాంగ్రెస్ నేటి నుంచి మునుగోడు నియోజకవర్గంలోని 175 గ్రామాల్లో పాదయాత్రకు నిర్ణయించింది. అటు టీఆర్ఎస్ అభ్యర్ధి ఖరారు పైన సమావేశాలు కొనసాగిస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే అధికారికంగా పార్టీ అభ్యర్ధిని ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నెల 20న మునుగోడులో టీఆర్ఎస్ బహిరంగ సభ జరగనుంది. ఇటు బీజేపీ మొత్తంగా ఆశలు రాజగోపాల్ పైనే పెట్టుకుంది.

కోమటిరెడ్డి భవిష్యత్ కు సవాల్ గా
స్థానికంగా కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఉన్న పట్టు తమకు అనుకూలిస్తుందని బీజేపీ లెక్కలు వేస్తోంది. దీంతో, రాజగోపాల్ బీజేపీ జాతీయ నాయకత్వం వద్ద తన సమర్థతను చాటుకొనేందుకు ఉప ఎన్నిక పరీక్షగా మారుతోంది. అదే సమయంలో రాజగోపాల్ రెడ్డి రాజకీయ భవిష్యత్ కు ఇది సవాల్ గా నిలుస్తోంది. మునుగోడులో ఉప ఎన్నిక బాధ్యతలను ముగ్గురు కీలక నేతలకు బీజేపీ అప్పగించింది.
ఈటల రాజేందర్, వివేక్, జితేందర్‌రెడ్డి కి ప్రధాన బాధ్యతలను కేటాయించింది. ఉప ఎన్నికల్లో జితేందర్ రెడ్డి ఇంఛార్జ్ గా పార్టీ తరపున వ్యవహరిస్తున్నారు. ఆయన ఇప్పుడు ఎన్నికల నిర్వహణలో తెలంగాణ బీజేపీలో కీలకంగా మారారు. ఆయనను మునుగోడులో మకాం వేయాల్సిందిగా పార్టీ నిర్దేశించింది.

బీజేపీ కీలక నేతలకు బాధ్యతలు
నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జి బాధ్యతను మాజీ ఎంపీ వివేక్‌కు అప్పగించాల్సిందిగా రాజగోపాల్‌రెడ్డి బీజేపీ రాష్ట్ర నేతలను కోరారు. ఈటల రాజేందర్ అత్తగారి ఊరు మునుగోడు మండలం పలివెల. ఈగ్రామం కేంద్రంగానే తన కార్యకలాపాలు నిర్వహించేందుకు రాజేందర్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం పాదయాత్రలో ఉన్న బండి సంజయ్..ఈ నెల 21న అమిత్ షా సమావేశం సమయానికి పార్టీ నుంచి మునుగోడు బాధ్యతల పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేయనున్నారు.
దీంతో...కాంగ్రెస్ పాదయాత్ర.. టీఆర్ఎస్ సభ.. 21న అమిత్ షా బహిరంగ సభ ద్వారా మునుగోడులో మూడు ప్రధాన పార్టీలు అధికారికంగా ప్రచారం ప్రారంభించనున్నాయి.












Click it and Unblock the Notifications