రాష్ట్రంలోనే నమ్మే పరిస్థితి లేదు.. జాతీయ స్థాయిలో కేసీఆర్ ని నమ్మేదెవరు? : విజయశాంతి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి మరో సారి విరుచుకుపడ్డారు. బీజేపీపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయ మాటలో ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకుని లేనిపోని నిందలు బీజేపీ పై మోపుతున్నారని ద్వజమెత్తారు. బట్ట కాల్చి పక్క వారి మీద పడేసి.. శాడిస్టులా ఆనందించడం కేసీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు.

రైతుల ఆత్మహత్యలు మర్చిపోయి...
కేసీఆర్ పాలనలో తెలంగాణలో జరుగుతున్న రైతులు, నిరుద్యోగులు, నిర్వాసితుల ఆత్మహత్యలను మర్చిపోయి బీజేపీపై లేనిపోని నిందలు వేస్తున్నారని రాములమ్మ మండిపడ్డారు. పాలన చేతగాక ప్రతిపక్షాలను విమర్శిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు. గత ఏడేళ్ళుగా కేంద్రంలోను...అదేవిధంగా పలు విడతలుగా వివిధ రాష్ట్రాలలో బీజేపీ అధికారపార్టీగా కొనసాగుతూ వస్తోంది. ఇదంతా బీజేపీ పట్ల ప్రజల చూపిస్తున్న ఆదరాభిమానాలు వల్లే సాధ్యమైందని స్పష్టం చేశారు

ఉద్దేశపూర్వకంగా బీజేపీపై మతకలహాల రంగు
మరి బీజేపీ పాలనలోని ఏ రాష్ట్రంలో ఏ పెట్టుబడులు ఆగిపోయాయో..? ఎక్కడ అభివృద్ధి నిలిచిపోయిందో..? ఎక్కడ మతకలహాలు జరిగాయో సీఎం కేసీఆర్ చెప్పాలని విజయశాంతి నిలదీశారు. ఉద్దేశపూర్వకంగా బీజేపీపై కేసీఆర్ మతకలహాల రంగు పులుమతున్నారని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చ జరుగుతుంది విద్యాసంస్థల్లో డ్రెస్ కోడ్‌కి సంబంధించిన అంశమే తప్ప మతకలహాలు కాదన్న సంగతి కేసీఆర్ గుర్తించుకోవాలని హితవు పలికారు.
Recommended Video

అధికారం చేజారిపోతుందనే భయం
తెలంగాణలో బీజేపీకి ప్రజాదరణను కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని రాములమ్మ ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ పార్టీకి అధికారం చేజారిపోతుందనే భయం ఆయనలో పుట్టిందని పేర్కొన్నారు. గత 2019 ఎన్నికల సమయంలో కూడా.. ఫెడరల్ ఫ్రంట్ అంటూ చేసిన స్టంట్ ఫెయిలై కేసీఆర్ చతికలపడ్డారనని ఎద్దేవా చేశారు. బంగారు తెలంగాణ అంటూ బంజరుగా మార్చారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోనే కేసీఆర్ ని నమ్మే పరిస్థితి లేదు. . ఇక జాతీయ స్థాయిలో ఆయనను నమ్మేదెవరు ? అని విజయశాంతి విమర్శించారు.












Click it and Unblock the Notifications