10 వేల ఆదిపురుష్ టికెట్లను బుక్ చేసిన టాప్ హీరో- ఉడుతా భక్తి
హైదరాబాద్: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న సినిమా- ఆదిపురుష్. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన మైథలాజికల్ మూవీ ఇది. శ్రీరాముడిగా ప్రభాస్, సీతమ్మగా కృతి సనన్ నటించారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్- రావణుడి పాత్రను పోషించారు. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నగే నటించారు. రాధేశ్యామ్ తరువాత ప్రభాస్ నటించిన సినిమా ఇదే.
ఈ పాన్ ఇండియా మూవీ ఈ నెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అభిమానులను పలకరించబోతోంది. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో చిత్రీకరణ జరుపుకొన్న ఈ సినిమాను టీ- సిరీస్ నిర్మించింది. ఓం రౌత్ దర్శకుడు. రామాయణం ఆధారంగా తెరకెక్కడం వల్ల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఆధ్యాత్మిక నగరి తిరుపతిని ఎంచుకుంది యూనిట్.

ఈ సాయంత్రం ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్టేడియంలో లక్షలాది మంది అభిమానుల సమక్షంలో ప్రభాస్- విల్లునెక్కుపెట్టారు. ఆదిపురుష్ యాక్షన్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్- యూట్యూబ్‌లో విడుదలైన కొద్దిసేపటికే రికార్డు స్థాయి వ్యూస్‌ను సాధించింది. 16వ తేదీన సినిమా విడుదల కాబోతోందని దర్శకుడు ఓం రౌత్ ప్రకటించారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ముగించుకున్న మరుసటి రోజే అభిషేక్ అగర్వాల్ ఆర్స్ట్ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 10,000పైగా ఆదిపురుష్ సినిమా టికెట్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించింది. ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్- తన సొంత ఖర్చులతో ఈ ఈ సినిమా టికెట్లను ఉచితంగా పంపిణీ చేస్తారని తెలిపింది.
తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు 10,000లకు పైగా ఆదిపురుష్ టికెట్లను ఉచితంగా అందజేస్తామని పేర్కొంది. దీనికోసం వారు గూగుల్ ఫామ్‌ను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఆ గూగుల్ ఫామ్ లింక్ https://bit.ly/CelebratingAdipurush. మొదటగా భర్తీ చేసిన వారికి మొదటి ప్రాధాన్యత పద్ధతిన టికెట్లను పంపిణీ చేసే అవకాశం ఉంది.
అభిషేక్ అగర్వాల్ తీసుకున్న ఈ నిర్ణయం.. ఇతర నటుల్లో స్ఫూర్తినింపుతోంది. తాజాగా- బాలీవుడ్ టాప్ హీరో రణ్‌బీర్ కపూర్ 10,000 ఆదిపురుష్ టికెట్లను బుక్ చేయనున్నారు. ఈ టికెట్లను అనాథ బాలబాలికలు, పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు పంపిణీ చేయనున్నారు. దీనికోసం ముంబైలోని కొన్ని ఛారిటీ, స్వచ్ఛంద సంస్థలతో రణ్‌బీర్ కపూర్ సంప్రదింపులు జరిపారు.
ముంబై సహా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఉండే నిరుపేద పిల్లలకు ఈ 10,000 టిక్కెట్లను కూడా ఆయన విరాళంగా ఇవ్వనున్నారు. నేటి తరం పిల్లలు రామాయణ గాథను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, శ్రీరాముడి జీవిత వృత్తాంతం నుంచి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉందని రణ్‌బీర్ కపూర్ చెబుతున్నారు. రామాయణాన్ని వారికి చేరవేసే క్రమంలో ఈ విరాళాన్ని తన చిరు సహాయంగా భావిస్తోన్నానని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications