సాగిపో.. నవ్వుతూ: క్యాన్సర్ వ్యాధి బాలుడి కోరికను తీర్చిన పోలీసులు
హైదరాబాద్: అందరూ చూస్తుండగా ఎరు రంగు బైక్‌పై రోడ్డుపై దూసుకువెళ్లాలనేది తన కోరిక అని చెప్పిన బాలుడి కోరికను 'మేక్ ఏ విష్ ఫౌండేషన్' ద్వారా తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు తీర్చారు. కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన చాకిబండ పవన్ కుమార్ (7) కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు.
గతేడాది డిసెంబర్‌లో తండ్రి రామాంజనేయులు పవన్‌ను నీలోఫర్ ఆసుపత్రిలో చేర్పించాడు. క్యాన్సర్ ఉందని తేలడంతో అక్కడ నుంచి ఎన్‌ఎంజే క్యాన్సర్ ఆసుపత్రికి తరలించారు. రోజురోజుకు పవన్ ఆరోగ్యం క్షీణిస్తోంది. దీంతో మూడు నెలల క్రితం అతడిని కలిసిన మేక్ ఏ విష్ ఫౌండేషన్ ప్రతినిధులు అతడి కోరికను తెలుసుకున్నారు.
సోమవారం ట్రాఫిక్ డీసీపీ ఎల్ ఎస్ చౌహాన్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు నుంచి జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ దాకా పవన్ ఎర్రరంగు మినీ బైక్‌ను నడిపి తన కోరికను తీర్చుకున్నాడు. బాలుడి బైక్ రైడ్ కోసం జూబ్లిహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస రెడ్డి ఏర్పాట్లు చేశారు.

అనంతరం పవన్ మాట్లాడుతూ ‘‘నాకు బతకాలని ఉంది. పెద్ద చదువులు చదివి సీబీఐ అధికారిని కావాలనుంది. మహేశ్‌బాబు అంటే ఇష్టం. శ్రీమంతుడు సినిమాలో మహేశ్ పేరు హర్ష నాకు ఎంతో నచ్చింది. అందుకే నా పేరును హర్షగా మార్చుకుంటున్నాను'' అని చెప్పాడు.
దీనిపై ట్రాఫిక్ డీసీపీ ఎల్‌ఎస్ చౌహన్ మాట్లాడుతూ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న పవన్ కుమార్ కోరికను ఫౌండేషన్ ప్రతినిధులు మా దృష్టికి తీసుకొచ్చారు. దీని కోసం కింది స్ధాయి అధికారులతో చర్చించామని, నిత్యం రద్దీగా ఉండే బంజారా హిల్స్ కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లి హిల్స్ చెక్ పోస్ట్ మార్గంలో పవన్ చేత బైక్ నడిపించామని చెప్పారు.
ముందుగానే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రత్యేక జాగ్రత్తులు తీసుకున్నామన్నారు. బైక్ నడుపుతున్నప్పుడు పిల్లవాడి ముఖంలో కనిపించిన ఆనందం మాకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మేం ఎప్పుడూ ముందుంటామని అన్నారు.












Click it and Unblock the Notifications