ఏం చేద్దాం.. ఓటమి పాలైన గులాబీ మంత్రులు, ఎమ్మెల్యేలలో భవిష్యత్తుపై ఆందోళన!!
తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దశాబ్ద కాలంగా పాలన సాగించిన బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. అధికార కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి పాలనా పగ్గాలు అప్పగించారు. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సీఎంగా దూకుడు చూపిస్తున్నారు. ఈ సమయంలో బీఆర్ఎస్ బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందా? కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా పార్టీని ముందుకు నడిపిస్తారా? అసలు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగాలా? వద్దా? ఒక ప్రశ్నగా మారింది.
కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో, అధికారం చేతిలో ఉన్న సమయంలో ప్రతీ నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు అక్కడ పెత్తనం చెలాయించారు. అధికారులకు హుకుం జారీ చేశారు. వారంతా ఆడింది ఆట, పాడింది పాట అనట్టు సాగింది. భూ ఆక్రమణలు చేసినా, ప్రత్యర్ధి పార్టీల నాయకులను బెదిరించినా అడిగిన నాధుడు లేడు. వారి మాటే శాసనం అన్నట్టు సాగింది.

దాదాపు పదేళ్ళ పాటు బీఆర్ఎస్ నుండి చాలా మంది ఎమ్మెల్యేలుగా కొనసాగారు. ఇక వారంతా ఈ సారి ఓటమి పాలు కావటంతో వాట్ నెక్స్ట్ అన్న చర్చ జరుగుతుంది. గతంలో తమ వల్ల బాధించబడిన, వేధించబడిన ప్రత్యర్థి పార్టీల నాయకులు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈక్రమంలో కక్ష సాధింపు చర్యలు ఉంటాయని భయపడుతున్నారు.
తమ అవినీతి, అక్రమాలను తవ్వి తీస్తారని భయపడుతున్నారు. ఈ క్రమంలో వారికి కేసీఆర్ కూడా భరోసా ఇవ్వలేకపోతున్నారని తెలుస్తుంది. ఓటమి బాధ నుండి కేసీఆర్ కోలుకోక ముందే ఆయన బాత్ రూ లో జారి పడటం, ఆయన తుంటి రీ ప్లేస్మెంట్ ఆపరేషన్ చేయించటం,ఆయన ఆస్పత్రిలో ఉండటంతో వారిలో ఆందోళన మరింత ఎక్కువైంది.
ఇంతకాలం పదవులను అనుభవించి, అధికార దర్పాన్ని చూపిన నాయకులు ఇప్పుడు తగ్గాల్సిన పరిస్థితులు వారిని నిద్ర పోనివ్వటం లేదు. భవిష్యత్ ఎలా ఉంటుందో అన్న భయం ప్రతీ ఒక్కరిలో స్పష్టంగా కనిపిస్తుంది. వారిలో అభద్రతా భావం పెరిగిపోతుంది. బయటకు కేసీఆర్ సారధ్యంలో ముందుకు వెళ్తామని చెప్పినా, రేవంత్ దెబ్బ కేసీఆర్ తట్టుకుని మమ్మల్ని కాపాడతారా అన్న అనుమానం ప్రతీ ఒక్కరిలో వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలో ఏం చేద్దాం అన్నది తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతున్నారు గులాబీ నేతలు.












Click it and Unblock the Notifications