బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్లీనరీల సంబరాలు!!
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సంబరాల్లో భాగంగా నిర్వహిస్తున్న ప్లీనరీలతో తెలంగాణ రాష్ట్రం గులాబీమయంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అట్టహాసంగా బీఆర్ఎస్ ప్లీనరీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నియోజక వర్గాల ప్రతినిధుల సభలు జరుగుతున్నాయి. మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు వివిధ ప్రాంతాలలో ఈ సభల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సభా వేదికల వద్ద, పార్టీ జెండా ఎగురవేసి వేడుకలు జరుపుకుంటున్నారు.
గడచిన 9 ఏళ్ళలో బిఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనీ, ఈ విషయమై ప్రతినిధుల సభల్లో తీర్మానాలు చేయాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్నాయి. పాలకుర్తి నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు మహాసభను నిర్వహించారు.

సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పాలకుర్తి ప్లీనరీని నిర్వహించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉంది? అంతకుముందు రాష్ట్రం ఎలా ఉంది? అన్న దానిపై ఆలోచించాలని, ప్లీనరీలో చేసే వివిధ తీర్మానాలపై గ్రామ స్థాయిలో చర్చలు జరగాలని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ ప్లీనరీని ఘనంగా నిర్వహించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ పట్టణంలో ప్రతినిధుల సభలో, పట్టణంలోని పలు వార్డుల్లో పార్టీ జెండా ఎగురవేశారు. సూర్యాపేట నియోజకవర్గ బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలలో రాష్ట్ర మంత్రి, జీ. జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ నేతృత్వంలోనే బంగారు తెలంగాణ సాకారం అవుతుందన్నారు.

ఇదిలా ఉంటే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ రేకుర్తి రాజశ్రీ గార్డెన్ లో బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్నారు. భావితరాల బాగు కోసం బీఆర్ఎస్ కు మరోసారి అండగా నిలవాలని గంగుల కమలాకర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు సమైక్య పాలనలో నీళ్లు నిధులు నియామకాలు దోచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అన్యాయానికి గురి చేశారని పేర్కొన్నారు.
ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని గుర్తు చేశారు. తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కెసిఆర్ నేతృత్వంలో వచ్చిన మార్పు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని, ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.












Click it and Unblock the Notifications