ఆ మంత్రిని తప్పించండి, ఇదిగో ఆధారాలు - రాహుల్ గాంధీకి హరీష్ లేఖ..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 22ఏ భూముల వ్యవహారం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వం పై ఈ వ్యవహారాన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకున్నారు. ఈ వ్యవహారం పైన సీఎం రేవంత్ కీలక హామీ ఇచ్చారు. మంత్రి పొంగులేటి క్షమాపణ చెప్పారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు నేరు గా కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీకి లేఖ రాసారు. కీలక అంశాలను ప్రస్తావించారు.
22ఏ భూముల వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. తెలంగాణలో 22A నిషేధిత జాబితా భూముల సెక్షన్ దుర్వినియోగంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో HMDA అనుమతులున్న వేలాది ప్రైవేటు ఆస్తులను 22A జాబితాలో పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతి జరుగుతోందని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 22A అనేది నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ ఆపడానికి తెచ్చిన చట్టమని.. ప్రైవేటు ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టించి వసూళ్లకు పాల్పడటానికి కాదని వెల్లడించారు. ప్రైవేటు ఆస్తులను ఏకపక్షంగా 22A జాబితాలో పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
తప్పించే వరకు పోరాటం ఆగదు
రెవెన్యూ శాఖలో నిషేధిత జాబితా నుంచి ఆస్తులు తొలగించుకోవడానికి దళారులు 30% కమీషన్లు డిమాండ్ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయని హరీష్ వివరించారు. 22Aపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. దీనిపై వెంటనే స్వతంత్ర విచారణకు రేవంత్ ప్రభుత్వం ఆదేశించాలి.
బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదు అని లేఖలో పేర్కొన్నారు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు నిషేధిత జాబితాలో చేర్చిన, తొలగించిన ప్రతి భూమిపైనా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ జరిపించాలని కోరారు. జిల్లాల వారీగా 22A జాబితాను పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలి.. ఏ భూమిని ఎప్పుడు చేర్చారు, ఎవరి ఆదేశంతో తీసేశారో ప్రజలకు పారదర్శకంగా తెలియాలని హరీష్ కోరారు.












Click it and Unblock the Notifications