జూబ్లీహిల్స్ లో వ్యూహం మార్చిన బీఆర్ఎస్ - తాజా సర్వేతో అలెర్ట్..!!
జూబ్లీహిల్స్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. పోలింగ్ సమయం సమీపించే వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. సర్వే నివేదికల ఆధారంగా పార్టీల నేతలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ కనిపిస్తోంది. ఎవరికి వారు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ మంత్రులను రంగంలోకి దించుతోంది. బీఆర్ఎస్ తాజా నివేదిక ల ఆధారంగా వ్యూహం మార్చింది. కొత్త ప్రణాళికలతో ఓటర్ల వద్దకు వెళ్తోంది. దీంతో... గెలుపు ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠగా మారుతోంది.
జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య తాజా సర్వే నివేదికల మేరకు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ సాగుతోంది. రెండు పార్టీల నుంచి కీలక నేతలు ప్రచారంలోకి దిగారు. కాంగ్రెస్ మంత్రులను ప్రతీ వార్డు బాధ్యతలు అప్పగించి.. గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ సమయంలో మాజీ సీఎం కేసీఆర్ జూబ్లీహిల్స్ పైన చేయించిన సర్వేల ఆధారంగా ప్రచారం.. పోల్ మేనేజ్ మెంట్ పైన కీలక నేతలకు దిశా నిర్దేశం చేసారు. అందులో భాగంగా కేటీఆర్ - హరీష్ ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా తమ పదేళ్ల పాలనలో హైదరాబాద్ లో వచ్చిన మార్పు.. కాంగ్రెస్ పాలనలో జరిగిన నష్టం గురించి ఎక్కువగా వివరిస్తున్నారు. మైనార్టీ ఓట్ బ్యాంక్ ఇక్కడ గెలుపు ఓటముల్లో కీలకంగా మారటంతో.. ఆ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కేటీఆర్ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలన పైనే ఎక్కువగా విమర్శ లు చేస్తూ.. తమ పాలనతో పోల్చి ఓటర్లకు అర్దమయ్యే విధంగా వివరిస్తున్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రగతి పాలనను, గత రెండేళ్ల కాంగ్రెస్ మోసాల పాలనను బేరీజు వేసుకొని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు తమ ఓటు వేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, బుల్డోజర్ పాలన నడుస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు.
మైనార్టీ ప్రాతినిధ్యం లేని తొలి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోనే ఏర్పడిందని కేటీఆర్ అన్నారు. ఆరుగురు ఎమ్మెల్సీలకు అవకాశం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ఒక్క మైనార్టీకి కూడా అవకాశం ఇవ్వలేదు. ఈ విషయాలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్.. బీజేపీ కలిసి పని చేస్తున్నాయని ప్రతీ చోట విమర్శిస్తున్నారు. హరీష్ బస్తీల పైన ఎక్కువగా ఫోకస్ చేసారు. దీంతో, హోరా హోరీగా సాగుతున్న ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నా.. తుది ఫలితం పైన ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications