దెబ్బ మీద దెబ్బ: బీఆర్ఎస్‌కు ఎంపీ గుడ్‌బై: కాంగ్రెస్ కండువా
MP Dayakar: దేశంలో ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర కమిషన్ విడుదల చేసింది. దేశ రాజధానిలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ ఎస్ఎస్ సంధూ ఈ షెడ్యూల్‌ను విడుదల చేశారు.
లోక్‌సభతో పాటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశాలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ షెడ్యూల్ విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చింది. లోక్‌సభతో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత ప్రభుత్వాల అయిదేళ్ల పదవీ కాలం ముగిసినట్టయింది. ఓటర్లు కొత్త ప్రభుత్వాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది.

తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికం భారత్ రాష్ట్ర సమితి ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని అధిగమించాలనే పట్టుదలతో ఉంది ప్రతిపక్ష బీఆర్ఎస్. లోక్‌సభ ఎన్నికల్లో పట్టు నిలుపుకోవడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించే పనిలో పడింది. లోక్‌సభ నియోజకవర్గాలవారీగా సమీక్షా సమావేశాలను నిర్వహిస్తోంది.
ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ ఇచ్చారు సిట్టింగ్ లోక్‌సభ సభ్యుడు పసునూరి దయాకర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే ఆయన హైదరాబాద్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ పెద్దలను కలుసుకున్నారు. వారి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు.
BRS Warangal MP Dayakar Resigned BRS & Joined Congress
— Congress for Telangana (@Congress4TS) March 16, 2024
గాంధీ భవన్.. కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ కు చెందిన వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, మరియు పలువురు ముఖ్య నాయకులు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖలు దయాకర్ కు కాంగ్రెస్ కండువా కప్పి… pic.twitter.com/y4FkQcl2Mt
వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్ రెండుసార్లు గెలిచారు. 2015 ఉప ఎన్నికతో పాటు 2019లోనూ ఆయనే గెలిచారిక్కడి నుంచి. ఈ సారి పసునూరి దయాకర్‌కు టికెట్ ఇవ్వలేదు కేసీఆర్. ఆయనకు బదులుగా పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యను బరిలో దించారు. దీనితో దయాకర్ పార్టీ ఫిరాయించారు.
ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి పలువురు సీనియర్లు, సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. నాగర్ కర్నూల్, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీలు పీ రాములు, బీబీ పాటిల్.. బీజేపీ కండువా కప్పుకొన్నారు. అదే జాబితాలో చేరారు దయాకర్. కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications