ఢిల్లీలో ఆప్ ఓటమికి బీఆర్ఎస్ పార్టీనే కారణం!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ స్పందిస్తూ బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ భస్మాసుర హస్తమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పరాజయానికి కారణమని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ల మద్యం కుంభకోణం ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ ప్రజలకు దూరంగా చేసిందన్నారు.
ఇక, ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలనుద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితమైనవని మండిపడ్డారు మంత్రి కొండా సురేఖ. ఈ అహంకారాన్ని అణిచివేసేందుకే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పారన్నారు.

అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా కాంగ్రెస్ పార్టీది ఎప్పుడూ పోరాట పంథానే అని కొండా సురేఖ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ పరమోన్నత లక్ష్యం ప్రజా సంక్షేమమే అని అన్నారు. తెలంగాణలో ఎలా పుంచుకున్నామో అలాగే దేశ వ్యాప్తంగా పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కోసం మీరు సున్నా సీట్లు తెచ్చుకున్నారని బీఆర్ఎస్ పార్టీపై మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదకు బీఆర్ఎస్ పార్టీనే కారణమని అన్నారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడంపై కేటీఆర్ ఆ పార్టీపై సెటైర్లు వేసిన విషయం తెలిసిందే.
కంగ్రాట్స్ రాహుల్ గాంధీ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాహుల్ మరోసారి బీజేపీని గెలిపించారంటూ సెటైర్లు వేశారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 48 స్థానాల్లో బీజేపీ విజయం సాధించి అధికార పీఠాన్ని చేజిక్కించుకుంది. ఇక, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమై ప్రతిపక్షంగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఒక్క సీటు కూడా దక్కకపోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications