10న బీఆర్ఎస్ ఎగ్జిక్యూటివ్ భేటీ: కీలక అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం
మార్చి 10న భారత్ రాష్ట్ర సమితి(BRS) పార్లమెంటరీ పార్టీ, శాసనసభా పక్షం, రాష్ట్ర కార్యవర్గం, సమావేశం కానుంది.
హైదరాబాద్: మార్చి 10న భారత్ రాష్ట్ర సమితి(BRS) పార్లమెంటరీ పార్టీ, శాసనసభా పక్షం, రాష్ట్ర కార్యవర్గం, సమావేశం కానుంది. తెలంగాణ భవన్‌లో మార్చి 10న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న సంయుక్త సమావేశానికి హాజరుకావాలని ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఆహ్వానం పంపారు.
ఈ సమావేశానికి బీఆర్ఎస్ కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, జెడ్పీ, కార్పొరేషన్ల ఛైర్మన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ చైర్మన్‌లు హాజరుకానున్నారు. ఎన్నికలు సమీపిస్లున్నవేళ పార్టీ కార్యాచరణపై నేతలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ, పార్టీ కార్యకలాపాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

కాగా, ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, పార్టీ కార్యకలాపాలు, తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ఆహ్వానితులు ప్రతీ ఒక్కరూ ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఇది ఇలావుండగా, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం గురువారం సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో గురువారం మధ్యాహ్నం కేబినెట్ భేటీ కానుంది. ఇళ్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశాలు, అర్హులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. సొంతంగా ఇళ్లు నిర్మించుకునేందుకు రూ. 3 లక్షలు ఆర్థిక సాయం ఇచ్చే పథకాన్ని కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ప్రారంభించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపైనా కీలకంగా చర్చించనున్నారు.












Click it and Unblock the Notifications