ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రేవంత్ రెడ్డి సర్కారు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీనియర్ నేత కే కేశవరావు సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఇటీవల ఉద్యోగులు జేఏసీ నేతలు, ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేబినెట్ సబ్ కమిటీ వేసి.. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వారికి సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది.

కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుపై తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. త్వరగా సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
కాగా, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం కరవు భత్యం (DA) పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. డీఏ పెంపు 2022 జులై ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని వెల్లడించింది. నవంబర్ జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపులు చేయనున్నారు. 2022 జులై 1 నుంచి 2024, అక్టోబర్ 31 వరకు డీఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాలో జయ చేయనున్నారు. 2025 మార్చి 31వ తేదీ లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు డీఏ బకాయిలు 17 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు 10 శాతం ప్రాన్ ఖాతాకు జమ చేస్తారు. 90 శాతం 2025 ఫిబ్రవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నారు. జీపీఎఫ్ ఖాతాలు లేని ఫుల్ టైం కంటింజెంట్ ఉద్యోగులకు 2025 ఫిబ్రవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేస్తారు. విశ్రాంత ఉద్యోగులకు డీఏ బకాయిలు 2025 జనవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.












Click it and Unblock the Notifications