ఇన్‌ఫ్లుయెన్సర్ భయ్యా సన్నీ యాదవ్‌పై కేసు నమోదు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లుగా మారిన కొందరు డబ్బులకు ఆశపడి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. బెట్టింగ్ యాప్స్, మోసపూరిత వ్యాపారాలను ప్రమోట్ చేస్తూ జైలు పాలవుతున్నారు. తాజాగా, మరో యూట్యూబర్ ఇదే విధంగా వ్యవహరించి కేసులో ఇరుక్కున్నారు. యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌పై ఇలాంటి కేసే నమోదైంది.
దేశ విదేశాల్లో బైక్ రైడింగ్ చేస్తూ పాపులారిటీ సంపాదించిన భయ్యా సన్నీ యాదవ్‌పై సూర్యపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడంపై సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటర్నేషనల్ బైక్ రైడర్, ఇన్‌ఫ్లుయెన్సర్ భయ్యా సన్నీ యాదవ్‌పై కేసు నమోదు కావడం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.

తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని ఇప్పటికే టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాసులకు కక్కుర్తి పడి అమాయకుల ప్రాణాలను తీస్తామంటే నడవదని ఆయన ఇటీవలే హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే భయ్యా సన్నీ యాదవ్‌పై కేసు నమోదు కావడం గమనార్హం. అతడ్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
పాపులారిటీ వచ్చిన తర్వాత డబ్బులకు ఆశ పడి మోసపూరిత యాప్‌లు, ఉత్పత్తులకు ప్రమోట్ చేయడంతో ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదయ్యాయి. మరికొందరు జైలుపాలయ్యారు కూడా. అయినప్పటికీ.. కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు అదే దారిలో నడిచి కటకటాలపాలవుతుండటం గమనార్హం. ఇప్పటికైనా నేరపూరిత, మోసపూరిత కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సజ్జనార్ లాంటి ఉన్నతాధికారులు హితవు చబుతున్నారు. మరోవైపు, బెట్టింగ్ యాప్స్ బారినపడి పలువురు యువకులు ప్రాణాలు తీసుకోవడం శోచనీయం.












Click it and Unblock the Notifications