ఇథనాల్ ఫ్యాక్టరీపై దాడి చేసిన 57మంది రైతులపై కేసులు.. 12మంది అరెస్ట్; రిమాండ్!
జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రతిపాదిత ఇథనాల్ ఫ్యాక్టరీపై రగడ కొనసాగుతోంది. నేడు కూడా రైతుల ఆందోళనలు, పోలీసుల కేసులు, అరెస్టులతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న జరిగిన దాడికి సంబంధించి మొత్తం 57 మంది రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కొంత మంది రైతులతో సహా 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉధృక్తత కొనసాగుతోంది.
ఇథనాల్ ఫ్యాక్టరీ దాడి,... పలువురు రైతుల అరెస్ట్, రిమాండ్
అరెస్ట్ చేసిన వారిని రిమాండ్ కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నలభై మంది పరారీలో ఉన్నారని, మరో ఐదుగురికి నోటీసులు జారీ చేసినట్లు రాజోలీ సబ్ ఇన్స్ పెక్టర్ జగదీశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. పెద్ద ధన్వడా, చిన్న ధన్వడా గ్రామస్తులు ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టి యూనిట్ పైనా, కొంత మంది ఫ్యాక్టరీ సిబ్బందిపై దాడి చేశారని సబ్ ఇన్స్ పెక్టర్ తెలిపారు.

కంపెనీ ఆస్తులపై 12 గ్రామాల రైతులు దాడి..40 లక్షల ఆస్తి నష్టం
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టిన దగ్గర 12 గ్రామాల రైతులు దాడి చేశారని, కంపెనీ నిర్మాణం చేపట్టే ప్రదేశంలో భారీ వాహనాలను, యంత్ర సామాగ్రిని, కూలీల పూరి గుడిసెలు, కంటైనర్లను తగులబెట్టి, వారి వాహనాలను ధ్వంసం చేశారని, సుమారు రూ 40 లక్షల ఆస్తి నష్టం చేశారని యజమాని మంజునాథ్ ఫిర్యాదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.
57 మందిపై కేసు నమోదు చేయగా 12 మంది నేడు అరెస్ట్
కంపెనీ యజమాని ఫిర్యాదు మేరకు ఇప్పటికి 57 మందిపై కేసు నమోదు చేయగా 12 మందిని నేడు అరెస్ట్ చేసి గద్వాల కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు.మరికొందరి కోసం నోటీసులు జారీ చేసి పోలీసులు గాలింపు చేపట్టారు. ఇక తాజా పోలీసు కేసులతో సమీప గ్రామాల ప్రజలు భగ్గుమంటున్నారు. తమకు ఇష్టం లేదని చెప్తున్నా మా ప్రాంతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో చెప్పాలని వారు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ వైఖరిపై రైతుల తీవ్ర ఆగ్రహం
. రైతులపై కేసులు పెట్టి, ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్న అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వ వైఖరికి వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఎలా ఏర్పాటు చేస్తారో తామూ చూస్తాం అంటూ రైతులు తేల్చి చెప్తున్నారు. తమ ప్రాణాలు కార్పోరేట్లకు పణంగా పెట్టలేం అంటున్నారు.












Click it and Unblock the Notifications