డ్యామిడ్ కథ అడ్డం తిరిగింది..బీఎల్ సంతోష్ విచారణపై ఎండ్ కార్డ్ పడినట్టేనా!!
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీయల్ సంతోష్ పేరును అనుమానితుడిగా విచారించాలని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారులు విఫలయత్నం చేశారు. ఆయనను నిందితుడిగా ఎఫ్ఐఆర్లో చేర్చటానికి కూడా ప్రయత్నం చేశారు. కానీ సిట్ అధికారుల ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇక ప్రస్తుతం కేసు సిబిఐ చేతిలోకి వెళ్లడంతో సిబిఐ అధికారులు బీయల్ సంతోష్ ను విచారిస్తారా? ఆయనను విచారించే అవకాశం ఉండదు అన్నది ఆసక్తికరంగా సాగుతున్న చర్చ. ఇక ఇదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ బి యల్ సంతోష్ ను గట్టిగా ఇరికించాలని అనుకున్నా, కనీసం తనను టచ్ కూడా చేయలేకపోయారు అన్నది తెలంగాణ రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

ఎమ్మెల్యేల ఎరకేసులో బీఎల్ సంతోష్ ను టార్గెట్ చేసిన సిట్
దేశ రాజకీయాలను మారుస్తానని బి ఆర్ ఎస్ పేరుతో బయలుదేరిన కేసీఆర్ ఎమ్మెల్యేల ఎర కేసులో ఎవరు ఉన్న వదిలిపెట్టేది లేదని మీడియా సాక్షిగా వెల్లడించారు. ఇక సిట్ ను ఏర్పాటు చేసి ఎమ్మెల్యేల ఎర కేసును అప్పగించారు. కానీ సిట్ అధికారులు ఈ కేసు దర్యాప్తులో అడుగడుగున ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రతి చిన్నదానికి కోర్టుకు వెళ్లి అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితులు సిట్ దర్యాప్తును ముందుకు సాగనివ్వలేదు. ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులుగా విచారించాలని భావించిన సిట్ మొదట అనుమానితులుగా బి ఎల్ సంతోష్, జగ్గు స్వామి, తుషార్ లకు నోటీసులు జారీ చేసింది.

కేసు సిట్ చేతి నుండి సీబీఐ చేతికి
ఇక ఈ నోటీసులపై కోర్టుకు వెళ్లిన ముగ్గురు ఆ నోటీసులపై స్టే తెచ్చుకున్నారు. దీంతో ఎఫ్ఐఆర్లో వారి పేర్లు లేవని స్టే తెచ్చుకున్న కారణంగా, ఎఫ్ఐఆర్లో వారి పేర్లు చేర్చడం కోసం సిట్ అధికారులు ప్రయత్నం చేశారు. ఇక ఈ ప్రయత్నాన్ని ఏసీబీ కోర్టు విరమించుకోవాలిసిందిగా సూచించి సిట్ అధికారులు వేసిన పిటిషన్ను కొట్టివేసింది. దీంతో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బి ఎల్ సంతోష్ ను విచారించడానికి సిట్ అధికారులకు అవకాశం లేకుండా పోయింది. ఇక నిందితులు నందకుమార్, రామచంద్ర భారతి, సింహయాజీ స్వామీజీలు కోర్టును ఆశ్రయించి ఈ కేసును సిబిఐతో విచారణ జరిపించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇక నిందితుల వాదనతో ఏకీభవించిన కోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించారు నిర్ణయం తీసుకుంది.

బీఎల్ సంతోష్ పేరు కూడా ఉండే అవకాశం లేదని చర్చ
దీంతో ఇప్పుడు ఈ కేసులో బి ఎల్ సంతోష్ ను అసలు ఎవరు టచ్ చేసే అవకాశం లేదు అన్నది చర్చ జరుగుతుంది. బి ఎల్ సంతోష్ విషయంలో సిట్ అధికారులు ఎన్నో అనుకున్నా వాటిని చేయలేకపోయారు. ఇక ఏకంగా బీఎల్ సంతోష్ తెలంగాణాకు వచ్చి పర్యవసానాలు ముందు ముందు చూస్తారని హెచ్చరించి మరీ వెళ్ళారు. ఇక ఈ కేసులో సీబీఐ ఎంట్రీతో బి ఎల్ సంతోష్ పేరు ఈ కేసులో ఉండబోదని చర్చ జరుగుతుంది. ఈ కేసు తిరిగి తిరిగి మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన నిందితులను పట్టించాను అని చెప్పుకుంటున్న పైలట్ రోహిత్ రెడ్డి కి చుట్టుకునే అవకాశమున్నది అన్న చర్చ ప్రస్తుతం ఆసక్తికరంగా సాగుతుంది.

బీఎల్ సంతోష్ ను టచ్ కూడా చెయ్యలేకపోయిన కేసీఆర్ , సిట్
బి యల్ సంతోష్ పేరు పెట్టి, బీజేపీని ఇరకాటంలోకి నెట్టి దేశవ్యాప్తంగా ఒక్కసారిగా బీఆర్ఎస్ పై అటెన్షన్ రావాలని సీఎం కేసీఆర్ ప్రయత్నం చేస్తే, డామిట్ కథ అడ్డం తిరిగింది అన్న చందంగా ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయ్యి ఈ కేసులో మొత్తం ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, నిందితుల చుట్టూ తిరిగే అవకాశం కనిపిస్తున్నదన్నది చర్చనీయాంశమవుతోంది. మొత్తానికి సీఎం కేసీఆర్, తెలంగాణ సిట్ ఎమ్మెల్యేలు ఎర కేసులో బి ఎల్ సంతోష్ ను కనీసం టచ్ కూడా చేయలేకపోయారు అన్నది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications