కేసీఆర్ కు షాక్: తొలిసారి కేంద్రం తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు; అమిత్ షా హాజరు!!
తెలంగాణ రాష్ట్రం పై బిజెపి మరింత ఫోకస్ చేస్తోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతకాలానికి తొలిసారి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ ఢిల్లీ వేదికగా నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై దృష్టి సారిస్తున్నట్లుగా తాజా పరిణామాలతో కనిపిస్తుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కు షాక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న బీజేపీ ఆ దిశలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8 ఏళ్ల తర్వాత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీలో అధికారికంగా తెలంగాణా ఫార్మేషన్ డే వేడుకలు నిర్వహిస్తున్న కేంద్రం
ఇది జూన్ 2 న న్యూఢిల్లీలో అధికారికంగా "తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని" జరుపుకోనున్నట్లు కేంద్రం ప్రకటించింది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ- డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో నిర్వహించే వేడుకలను నేషనల్ ఇంప్లిమెంటేషన్ కమిటీ (ఎన్‌ఐసి) ఆమోదించిందని పేర్కొన్నారు. ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.

తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలతో ప్రజల్లో పట్టు పెంచుకునే యత్నాలు
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు భావసారూప్యత గల పార్టీలు, నేతలతో చర్చల ద్వారా దేశానికి ప్రత్యామ్నాయ అభివృద్ధి ఎజెండాను రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్న కెసిఆర్ తీరుతో, తీవ్ర అసహనం లో ఉన్న బిజెపి తెలంగాణపై ఫోకస్ పెడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కు చెక్ పెట్టడానికి, తెలంగాణలో భవిష్యత్తు ఎన్నికలలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు కనిపించడానికి, రాజకీయంగా పట్టు పెంచుకోవడానికి బిజెపి వ్యూహాలు రచిస్తోంది . అందులో భాగంగానే బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరపాలని నిర్ణయం తీసుకుంది.

తొలిసారి కేంద్రం తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా తెలంగాణలోనూ, ఢిల్లీలోనూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. తొలిసారి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రాణత్యాగం చేసిన యువతను అన్ సంగ్ హీరోస్ పేరుతో ప్రస్తావిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని, తెలంగాణ గొప్పతనాన్ని తెలియజేసేలా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించనుంది.

తెలంగాణా ఆవిర్భావ వేడుకల్లో పాల్గొననున్న హోం మంత్రి అమిత్ షా
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఇక ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొని ప్రసంగించనున్నారు. తొలిసారి జరగనున్న ఈ వేడుకలను తెలంగాణా ప్రాంతానికి చెందిన మంత్రి కిషన్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు.

తెలంగాణాపై ఫోకస్ చేస్తున్న బీజేపీ ..
వేడుకల్లో భాగంగా తెలంగాణకు చెందిన జానపద గాయకురాలు మంగ్లీ, వేదాల హేమచంద్ర సంగీత విభావరి చేయనున్నారు. తెలంగాణకు చెందిన జానపద కళాకారులచే ప్రదర్శనలు ఉంటాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సాక్షిగా, తెలంగాణ పట్ల బిజెపికి నిజంగానే శ్రద్ధ ఉందనే సెంటిమెంట్‌ను ప్రచారం చేయడానికి బిజెపి నేతలు ప్రయత్నిస్తున్నారు. అందుకే తెలంగాణా ప్రభుత్వానికి పోటీగా తెలంగాణా ఫార్మేషన్ డే వేడుకలను నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలు ఈ మేరకు ఫలిస్తాయో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications