రైతన్నలకు శుభవార్త చెప్పిన కేంద్రం.. సంతోషించిన తెలుగురాష్ట్రాలు!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో యూరియా కోసం రైతులు ప్రాధమిక వ్యవసాయ కేంద్రాల వద్ద, రైతు వేదికల వద్ద పడిగాపులు కాస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ యూరియా సరిపడినంత లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోజంతా క్యూలైన్లో నిలబడలేక చెప్పులు క్యూ లైన్ లో పెట్టి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రైతుల యూరియా సమస్యలపై ఏపీలో వైసిపి, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి.
రైతులు యూరియా కోసం డిమాండ్
తక్షణం రైతులకు యూరియా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాలకు ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల యూరియా కొరత వచ్చిందని, రైతుల సంక్షేమంలో ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయని టార్గెట్ చేస్తున్నారు. ఇక ఇదే క్రమంలో తాజాగా రైతులకు రిలీఫ్ ఇచ్చే వార్త చెప్పారు ఏపీ, తెలంగాణ మంత్రులు.

ఏపీకి అదనంగా యూరియా కేటాయించిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా వివిధ పోర్టుల ద్వారా చేరుకోనుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్రం పలు రాష్ట్రాలకు యూరియాను కేటాయించిన సందర్భంగా రాష్ట్రానికి అధిక ప్రాముఖ్యతను ఇస్తూ 41,170 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించిందని మంత్రి అన్నారు.
త్వరలో యూరియా అందుబాటులోకి
అందులో భాగంగా కృష్ణపట్నం పోర్ట్ ద్వారా 11,605, కాకినాడ పోర్ట్ ద్వారా 18,765 , మంగుళూరు పోర్ట్ ద్వారా 2700, జైగడ్ పోర్ట్ ద్వారా 8100 మెట్రిక్ టన్నుల యూరియా ఈ నెల 16 నుండి 18 వ తేదీలోపు రవాణా జరుగుతుందని వెల్లడించారు. ఈ కేటాయింపుతో రైతులకు వెసులుబాటు లభిస్తుందని , రైతులకు ఎరువుల కొరత లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు.
యూరియాపై ఆందోళన వద్దన్న మంత్రి అచ్చెన్నాయుడు
రాష్ట్రంలో ఇప్పటికే సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ రాష్ట్రానికి అధిక మొత్తంలో యూరియాను కేటాయించేలా చర్యలు చేపడుతున్న సీఎం చంద్రబాబు కి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ కావాలనే యూరియా సరఫరాపై అబద్ధాలు ప్రచారం చేస్తోందని మంత్రి తీవ్రంగా విమర్శించారు.
రాజకీయ లబ్ది కోసమే వైసీపీ రైతుల పేరుతో డ్రామాలు
రైతులను భయపెట్టి రాజకీయ లాభాలు పొందాలన్న ప్రయత్నం విజయవంతం కాదని ఆయన అన్నారు. రైతు సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వైసీపీ నేతలు రైతుల సమస్యలపై కన్నెత్తి చూడరని, నేడు తప్పుడు ప్రచారాలతో రైతాంగాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు నమ్మకం కోల్పోయిన పార్టీగా వైసీపీ మిగిలిపోయిందని, వారి నాటకాలకు రైతాంగం మోసపోరని స్పష్టం చేశారు.
తెలంగాణాకు కేంద్రం అదనపు యూరియా కేటాయింపు
మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి సైతం రాష్ట్రానికి అదనంగా మరో నలభై వేల మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ రాష్ట్రానికి మరో 5 ఓడల నుండి కేటాయింపులు చేసినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే కేటాయించిన 40 వేల టన్నులకు ఇది అదనం అని ఆయన వెల్లడించారు. పది రోజుల్లో మరో లక్ష మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాలని కోరామని మెట్రిక్ టన్నులను సరఫరా చేస్తామని కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రా వెల్లడించారని తెలిపారు.












Click it and Unblock the Notifications