తెలంగాణలో ఇస్లామిక్ స్టేట్‌పై కేంద్రం ఆరా: టిఆర్ఎస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఫైర్
హైదరాబాద్: తెలంగాణలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది. ఐఎస్ఐస్ కార్యకలాపాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఐఎస్ఎస్‌లో చేరడానికి వెళ్తున్న ముగ్గురు హైదరాబాదీలను ఇటీవల నాగపూర్‌లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
అంతేకాకుండా, ఐఎస్ఐఎస్ సానుభూతిపరులు తెలంగాణలో పెద్ద యెత్తున ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. హైదరాబాదుతో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులకు గల సంబంధాలు ఒక్కొటొక్కటే బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరినట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, హైదరాబాద్ ఐసిస్ కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత వల్లే ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోయాయని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌ను టెర్రరిస్ట్‌లు సేఫ్‌జోన్‌గా మార్చుకుంటున్నారని అన్నారు. ఎంఐఎం ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తప్పుడు సర్వేలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications