తెలంగాణలోని ఆ రెండు గ్రామాలకు జాతీయ స్థాయి గుర్తింపు
హైదరాబాద్: తెలంగాణలోని రెండు గ్రామాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. సంస్కృతి, హస్తకళలు, ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరైన ఈ రెండూ.. దేశంలోనే అత్యుత్తమ పర్యాటక గ్రామాలుగా ఎంపికయ్యాయి. ఈ మేరకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణకే చెందిన జీ కిషన్ రెడ్డి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న శాఖ ఇది.
ఈ రెండు గ్రామాలు- జనగాం జిల్లాలోని పెంబర్తి, సిద్ధిపేట జిల్లాలోని చంద్లాపూర్. ఈ రెండింటినీ దేశంలోనే అత్యుత్తమ పర్యాటక గ్రామాలుగా ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ నోడల్ ఏజెన్సీ ఫర్ రూరల్ టూరిజం, రూరల్ హోమ్‌స్టే ఈ మేరకు ఈ రెండింటినీ ఎంపిక చేసింది.

ఈ కేటగిరీలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు పోటీ పడ్డాయి. దీనికి సంబంధించి తమ ఎంట్రీలను పంపించాయి. మొత్తంగా 795 దరఖాస్తులు దాఖలయ్యాయి. వాటన్నింటినీ వడపోసిన అనంతరం కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ పెంబర్తి, చంద్లాపూర్ గ్రామాలను ఎంపిక చేసింది.
ఈ నెల 27వ తేదీన న్యూఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక శాఖ, చంద్లాపూర్, పెంబర్తి గ్రామ పంచాయతీ ప్రతినిధులు ఈ అవార్డులను అందుకోనున్నారు. పెంబర్తి కాకతీయుల కాలం నుంచీ హస్తకళలకు ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడ తయారయ్యే
ఇత్తడి, కంచు లోహ కళాకృతులు అమెరికా, బ్రిటన్, జపాన్ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
చంద్లాపూర్‌లో రంగనాయక స్వామి దేవాలయం, రంగనాయక కొండలు, రంగనాయక సాగర్ రిజర్వాయర్.. దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకట్టుకుంటోన్నాయి. ఇక్కడ తయారయ్యే గొల్లభామ చీరలు తెలంగాణ కళాసంస్కృతికి ప్రతిబింబాలుగా నిలుస్తోన్నాయి. ప్రకృతి సౌందర్యం, సంస్కృతి, కళలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు గ్రామాలను అత్యుత్తమ పర్యాటక గ్రామాలుగా ఎంపిక చేసినట్లు జీ కిషన్ రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications