వదల బొమ్మాలీ వదలనంటున్న చంద్రబాబు, ఆయనది పొరుగు రాష్ట్రం: కేసీఆర్
మహబూబ్ నగర్/జడ్చర్ల: నాలుగేళ్ల తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో పాలమూరు ఎంత మారిపోయిందో అందరి కళ్లముందు ఉందని, పాలమూరు ఎత్తిపోతల పథకం కడుతుంటే కట్టవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి ఉత్తరాలు రాశారని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిప్పులు చెరిగారు. కోటి ఎకరాల తెలంగాణ ఆకుపచ్చగా కనబడాలన్నారు.
పక్క రాష్ట్రానికి చెందిన చంద్రబాబు, మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకుంటున్నానని ఆనాడు చెప్పాడని, కానీ ఏమీ అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల బహిరంగ సభలో మాట్లాడారు.

వదల బొమ్మాలీ వదలను అంటున్న చంద్రబాబు
తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకున్నారని, కానీ ఆ తొమ్మిదేళ్లలో ఆయన ఒక్క ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేదని చెప్పారు. తెలంగాణను వదల బొమ్మాళీ వదలనని చంద్రబాబు అంటున్నారని విమర్శించారు. పాలమూరును చంద్రబాబు వలస జిల్లాగా మార్చారని మండిపడ్డారు.

తెలంగాణలో చొరబడాలని చంద్రబాబు
పోరాడి తెలంగాణను సాధించుకున్నామని చెప్పారు. మహాకూటమి పేరుతో తెలంగాణలోకి చొరబడాలని చంద్రబాబు చూస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడిగేందుకు వస్తున్నారని ప్రశ్నించారు. ఉడుముల్లా మన ప్రయోజనాలను దెబ్బతీయాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు జిల్లాను చంద్రబాబు వలస జిల్లాగా మార్చారన్నారు.

వలస వెళ్లిన వారు తిరిగి వస్తున్నారు
పాలమూరులో 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని కేసీఆర్ చెప్పారు. చంద్రబాబును పాలమూరు ప్రజలు తరిమి కొట్టాలని చెప్పారు. పాలమూరుపై కాంగ్రెస్ నేతలు 35 కేసులు వేశారని చెప్పారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నామని చెప్పారు. పాలమూరు జిల్లాలో 8.5 లక్షల ఎకరాలకు నీరు అందించామని చెప్పారు. వలస వెళ్లిన వారు తిరిగి పాలమూరుకు వస్తున్నారని చెప్పారు.

చంద్రబాబు పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని కేసీఆర్ చెప్పారు. అయినా ఆయన తెలంగాణను వదలడం లేదని విమర్శించారు. పాలమూరును వలస జిల్లాగా మార్చి ఓట్లు ఎలా అడుగుతాడో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్లీ మోటార్లు కాలిపోతాయని, కరెంట్ పోతుందని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో నా మోటార్లు కూడా కాలిపోయాయని చెప్పారు.
తెలంగాణ రాదని అవహేళన
నేను బక్కపలుచగా ఉన్నానని, కాంగ్రెస్ నేతలు అంతంత ఉన్నారని కేసీఆర్ చెప్పారు. నాడు కరెంట్ ఉంటే వార్త, నేడు కరెంట్ పోతే వార్తగా మారిందని చెప్పారు. ఇవి మాములుగా జరుగుతున్న ఎన్నికలు కాదని చెప్పారు. తెలంగాణ రానే రాదని అవహేళన చేశారని, ప్రతికూల పరిస్థితుల్లో ఏకతాటిపై నిలిచి రాష్ట్రాన్ని సాధించామని, ఇప్పుడు అదేవిధంగా అభివృద్ధిలో ముందుకు సాగుతామని చెప్పారు. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు 90 శాతం పూర్తి అయ్యాయన్నారు.












Click it and Unblock the Notifications