మీ వద్దకే వచ్చి.. భూ భారతి సదస్సులతో భూముల సమస్యలకు చెక్!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూ భారతి కార్యక్రమం ద్వారా గ్రామాలలో రెవెన్యూ అధికారులు ప్రజల భూ సమస్యలను పరిష్కరించడానికి రంగంలోకి దిగారు. ఇక ఈ క్రమంలో ప్రజల దగ్గరికి రెవెన్యూ అధికారులు వెళ్లి వారి సమస్యల పరిష్కారం కోసం నేటి నుంచి దరఖాస్తులను తీసుకుంటున్నారు. వారి సమస్యలను నేరుగా వెళ్లి తెలుసుకుంటున్నారు. గ్రామ గ్రామాన సదస్సులను నిర్వహిస్తూ ప్రజల వద్దకే పాలనను తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి సదస్సులు
గత ప్రభుత్వం ధరణి పోర్టల్ ను తీసుకువచ్చి భూముల సమస్యలను పరిష్కారం చేస్తామని చెబితే, దానిని వ్యతిరేకించిన కాంగ్రెస్, ప్రస్తుతం భూభారతి ద్వారా ప్రజలకు సులభతరమైన పాలనను అందిస్తామని, సత్వర పరిష్కారాలను చేస్తామని, భూములకు భద్రత కల్పిస్తామని చెబుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూభారతి చట్టంపై అవగాహన కల్పిస్తూ నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు.

రైతుల భూ సమస్యల పరిష్కారం కోసమే సదస్సులు
ప్రతి జిల్లాలోను భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఈ సదస్సులలో జిల్లా అధికార యంత్రాంగం పాల్గొని రైతుల సమస్యలను పరిష్కరించనున్నారు. భూభారతి ద్వారా ప్రతి జిల్లాలోనూ జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామ గ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు అందుకు ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్లు వెల్లడించారు. రైతుల భూ సమస్యల పరిష్కారం దిశగా ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
పదిహేను రోజుల పాటు గ్రామాలలో ఈ సమస్యలపై దరఖాస్తులు
పదిహేను రోజులపాటు గ్రామాల వారీగా నిర్వహించే ఈ సదస్సులు రైతులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న భూ సమస్యలకు పరిష్కారం చూపేలా గ్రామాల వారీగా దరఖాస్తులు స్వీకరించనున్నట్టు వెల్లడించారు. రెవెన్యూ విభాగంలో ఇప్పటివరకు ఎదుర్కొంటున్న సమస్యలకు రైతులు స్పష్టంగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందన్నారు.కొత్త పాసు పుస్తకం రానివారు, పాసుపుస్తకం లో సర్వే నెంబర్లు, విస్తీర్ణం సంక్రమించిన విధానం, భూమి స్వభావం, పట్టాదారు పేరు తప్పుగా నమోదైన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ఈ సమస్యలపైనా దరఖాస్తు చేసుకోవచ్చు
వాస్తవంగా సాగులో ఉన్న భూమి కంటే పాసు పుస్తకంలో తక్కువగా నమోదు ఉన్నవారు. సాగులో ఉన్న భూములు నిషేధిత జాబితాలో ఉన్నవారు. క్రమబద్దీకరణ కాని వారు. ఓఆర్సి రాని ఇనాం భూములు పొందిన రైతులు, టెనెన్సీ ధ్రువపత్రాలు రానివారు సర్వే డివిజన్ సమస్యలు ఉన్నవారు , భూసేకరణ సమస్యలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని తెలిపారు.












Click it and Unblock the Notifications