TS GOs: తెలంగాణలో మరో రెవెన్యూ డివిజన్: 350 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకం
హైదరాబాద్: మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ప్రజల చిరకాల కోరిక ఎట్టకేలకు నేరవెరుతోంది. చెన్నూరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ చెన్నూరు పట్టణాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.
ఇటీవల మంచిర్యాల పర్యటనలోనూ మంత్రి కేటీఆర్ చెన్నూరును రెవెన్యూ డివిజన్ చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. చెన్నూరు డివిజన్ పరిధిలోకి చెన్నూరు, జైపూర్, భీమారం, కొత్తపల్లి, మందమర్రి, అస్నాద్, పారుపల్లి మండలాలతో డివిజన్ ఏర్పాటుకు ప్రతిపాదించింది.

దీంతోపాటు ప్రస్తుతం చెన్నూరు మండలంలో ఉన్న అస్నాద్‌ను కొత్త మండల కేంద్రంగా, 11 గ్రామాలతో మండలాన్ని, కొత్తపల్లి మండలంలో కొనసాగుతున్న పారుపల్లి కేంద్రంగా 19 గ్రామాలతో కొత్త మండలాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మరో 350 దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకం
తెలంగాణ రాష్ట్రంలోని మరో 350 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పథకం అమలవుతున్న ఆలయాల సంఖ్య 6,271 పెరిగింది. అలాగే అక్టోబర్ నెల నుంచి ధూప దీప నైవేద్య పథకం ఆలయాలకు ప్రతి నెలా రూ.10వేల చొప్పున చెల్లించనున్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వం ధూపదీప నైవేద్యం పథకానికి శ్రీకారం చుట్టింది.
రాష్ట్రంలో ఉన్న సుమారు 11వేలకుపైగా ఆలయాలను ఈ పథకంలో చేర్చాలనే ప్రతిపాదన ఉండగా.. దశలవారీగా పథకాన్ని వర్తింపజేస్తోంది. ఇందులో భాగంగా 350 ఆలయాలను కొత్తగా చేర్చింది. అంతేగాక, 3,500 ఆలయాల్లోని అర్చకులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు సైతం ప్రభుత్వం చెల్లిస్తుంది. దీంతో 9,771 ఆలయాలకు ప్రభుత్వ సహకారం ద్వారా ధూప దీప నైవేద్య కార్యక్రమాలు అమలవుతాయి.
మిగతా మరో 250 ఆలయాలకు సైతం పథకాన్ని వర్తింపజేసేందుకు దేవాదాయశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే మొత్తం సంఖ్య 11వేలు దాటనున్నది. మరో వైపు ఆయా ఆలయాల్లోని అర్చకులకు అక్టోబర్ నెల రూ.10వేల వేతనం ఇవ్వనున్నారు. హైదరాబాద్‌లో బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ అర్చకుల గౌరవేతనాన్ని రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications