
తీన్మార్ మల్లన్నపై లక్ష్మీకాంత శర్మ కేసు.. రూ.30లక్షలు డిమాండ్ చేస్తున్నాడని.. అసలేంటీ వివాదం..?
ప్రముఖ జర్నలిస్ట్,క్యూ టీవీ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్నపై హైదరాబాద్‌లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. లక్ష్మీకాంత శర్మ అనే జ్యోతిష్యుడి ఫిర్యాదు మేరకు మల్లన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లన్న తన నుంచి రూ.30లక్షలు డిమాండ్ చేశారని లక్ష్మీకాంత శర్మ ఫిర్యాదులో ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోవడంతో తన యూట్యూబ్ ఛానెల్‌లో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాడని ఆరోపించారు. ఈ నెల 22న లక్ష్మీకాంత శర్మ నుంచి తమకు లిఖితపూర్వక ఫిర్యాదు అందడంతో మల్లన్నపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేష్ తెలిపారు.

అసలేంటీ వివాదం...
హైదరాబాద్ సీతాఫల్‌మండి డివిజన్ మధురానగర్‌కాలనీలో మారుతి సేవా సమితి పేరిట లక్ష్మీకాంతశర్మ జ్యోతిషాలయం నిర్వహిస్తున్నాడు. ఇటీవల 'లక్ష్మీకాంత శర్మ బాధితులు' పేరుతో తీన్మార్ మల్లన్న యూట్యూబ్ ఛానెల్‌లో కొన్ని కథనాలు ప్రసారమయ్యాయి. అందులో లక్ష్మీకాంత శర్మ బాధితులమని చెబుతూ కొంతమంది తీన్మార్ మల్లన్నకు ఫోన్ చేసి మాట్లాడారు. సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి పూజలు,తాయెత్తులు,లాకెట్ల పేరుతో లక్ష్మీకాంత శర్మ తమ నుంచి డబ్బులు దోచుకున్నాడని ఆరోపించారు. ఆయన ఇచ్చిన తాయెత్తులు,లాకెట్లతో తమకేమీ మంచి జరగలేదని... అప్పులు చేసి మరీ డబ్బులు చెల్లించి మోసపోయామని కొంతమంది బాధితులు వాపోయారు.

లక్ష్మీకాంత శర్మపై ఆరోపణలు...
లక్ష్మీకాంత శర్మపై తీన్మార్ మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతనో పెద్ద చోర్ అని... అతని వెనక బడా వ్యక్తులు ఉన్నారని ఆరోపించారు. అతని సంపాదనలో కొంత మొత్తం ఆ వ్యక్తులకు వాటాగా వెళ్తోందన్నారు. అంతేకాదు,కొంత వాటా పోలీసులకు,కొంత వాటా మీడియాకు కూడా వెళ్తోందని ఆరోపించారు. పూజలు,పరిష్కారాల పేరుతో అమాయ ప్రజలను మోసం చేసి డబ్బులు కొల్లగొట్టాడని ఆరోపించారు. లక్ష్మీకాంత శర్మ దందా,అతని చిట్టా మొత్తం తన వద్ద ఉందని చెప్పుకొచ్చారు. గతంలో ఓ సందర్భంలో కదులుతున్న వాహనంలో పేకాట ఆడుతూ అతను పట్టుబడ్డాడని ఆరోపించారు.

మల్లన్నకు లక్ష్మీకాంత శర్మ మనుషుల ఫోన్...
ఓవైపు లక్ష్మీకాంత శర్మ తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేయగా... మరోవైపు ఆయన నుంచి తమకు బెదిరింపులు వస్తున్నట్లుగా తీన్మార్ మల్లన్న యూట్యూబ్ ఛానెల్‌లో ఓ ఆడియో కాల్‌ను అప్‌లోడ్ చేశారు. అందులో లక్ష్మీకాంత శర్మ తరుపున ఫోన్ చేసిన వ్యక్తి మీ ఎక్స్‌పెక్టేషన్ ఏంటని అడగ్గా.. లంచంతో మమ్మల్ని కొంటారా అంటూ తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. బాధితులు తమ వద్దకు వస్తున్నందునే కథనాలు ప్రసారం చేస్తున్నామన్నారు. తాను ఎలాంటి వాడినో అందరికీ తెలుసునని... తీన్మార్ మల్లన్న డబ్బులు అడగడని అన్నారు. కూర్చొని మాట్లాడుకుందామని అవతలి వ్యక్తి చెప్పగా... అది కుదరదని నిందితుడిని అరెస్ట్ చేయాల్సిందిగా తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అయితే రూ.5కోట్లు మీరు అడిగినట్లుగా తెలుస్తోందని... అంత డబ్బు ఇస్తే వదిలిపెడుతారా అని ఆ వ్యక్తి మాట్లాడాడు. అందుకు బదులుగా... రూ.5కోట్లు కాదు రూ.5వేల కోట్లు ఇచ్చిన వదిలిపెట్టేది లేదని,సామాన్యుల తరుపున నిలబడతానని మల్లన్న వెల్లడించారు. ఈ వ్యవహారం మున్ముందు ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.