ఢిల్లీ కేంద్రంగా బీఆర్ఎస్ నేడే - ప్రత్యేక అతిధుల సమక్షంలో : కేటీఆర్ గైర్హాజరు..!!
ఢిల్లీ కేంద్రంగా సీఎం కేసీఆర్ కొత్త రాజకీయం ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ఏర్పాటు కావటంతో..టార్గెట్ బీజేపీ రాజకీయం నేటి నుంచి ప్రారంభం కానుంది. అందులో భాగంగా పార్టీ ఢిల్లీ కేంద్రంగా బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణతో పాటుగా పార్టీ కార్యాలయం ప్రారంభించనున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా అతిధులను ఆహ్వానించారు.
నేతలతో పాటుగా పలు రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలను ఆహ్వానించారు. బీఆర్ఎస్ అజెండాను ఢిల్లీ వేదికగా ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ సిద్దమయ్యారు. అయితే, బీఆర్ఎస్ ఢిల్లీ కార్యాలయం ప్రారంభ వేడుకలకు మంత్రి కేటీఆర్ హాజరు కావటం లేదు.

బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం
బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఢిల్లీ కేంద్రంగా సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేసారు. ముహూర్తం ప్రకారం.. సరిగ్గా 12గంటల 37 నిమిషాల నుంచి 12 గంటల 47 నిమిషాల మధ్య బీఆర్ఎస్ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారు. ఆ వెంటనే పార్టీ కార్యాలయం ప్రారంభిస్తారు. ఢిల్లీలోని వసంత విహార్ లో బీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
ఆ భవనం నిర్మాణం పూర్తయ్యే వరకూ ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసారు. ఢిల్లీ కేంద్రంగా జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ఆవిష్కార వేళ రాజశ్యామల హోమం నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో పలువురు ప్రముఖులను బీఆర్ఎస్ ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది.

జాతీయ నేతలు- అయిదు రాష్ట్రాల రైతులకు ఆహ్వానం
బీఆర్ఎస్ ప్రకటన సమయంలో సీఎం కేసీఆర్ తన నినాదం ప్రకటించారు. ఆప్ కీ బార్ కిసాన్ కీ సర్కార్ అనే నినాదంతో తమ పార్టీ పని చేస్తుందని స్పష్టం చేసారు. అందులో భాగంగానే.. ఢిల్లీలో పార్టీ భవనం.. కార్యకలాపాల ప్రారంభ వేళ మద్దతుగా నిలుస్తున్న పార్టీ నేతలతో పాటుగా పలు రాష్ట్రాల్లోని రైతు సంఘాల నేతలను ఆహ్వానించారు.
కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హాజరు కానున్నారు. ఇప్పటికే కర్ణాటకలో పోటీ పైన కేసీఆర్ ప్రకటన చేసారు. కర్ణాటకలో తమకు ఆదరణ ఉంటుందని చెబుతూనే.. కుమార స్వామిని ముఖ్యమంత్రిని చేసేందుకు బీఆర్ఎస్ సహకరిస్తుందని కేసీఆర్ స్పష్టం చేసారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు ఢిల్లీకి చేరుకున్నారు. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, ఒడిసా, తమిళనాడుకు చెందిన నేతలు, రైతు నాయకులు కూడా హాజరుకానున్నారు.

కార్యక్రమాలకు దూరంగా మంత్రి కేటీఆర్
ఢిల్లీ కేంద్రంగా బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభ వేడుకలకు మంత్రి కేటీఆర్ హాజరు కావటం లేదు. ముందే నిర్ణయించబడిన రెండు కీలకమైన పెట్టుబడి సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో ప్రఖ్యాత వాహన దిగ్గజం మారుతి సుజుకి కి చెందిన అంతర్జాతీయ విభాగాల అధిపతులతో కేటీఆర్ సమావేశం ముందుగా ఫిక్స్ అయింది.
మంత్రి కేటీఆర్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యేందుకు ఆ సంస్థ ప్రతినిధి బృందం హైదరాబాద్ చేరుకుంది. జపాన్ కంపెనీలు సమయపాలన, షెడ్యూలింగ్ వంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తాయి. దీంతో పాటుగా ఈ రోజు సలార్పురియా నాలెడ్జ్ పార్కులో బోస్క్ ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఈ రెండు కీలకం కావటంతో.. ఢిల్లీ పర్యటనను మంత్రి కేటీఆర్ రద్దు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications